YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

రథ సప్తమి - హిందూ ధర్మచక్రం

రథ సప్తమి - హిందూ ధర్మచక్రం

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఈరోజున సూర్యుడు ???? జన్మించాడు అని వేదం చెబుతుంది. సూర్య జయంతి అన్నమాట.  సూర్య భవవానుడు కశ్యప మహాముని కుమారుడు . తేజొవంతుడు . భార్యా బిడ్డలు ఉన్న దేవతామూర్తి.  ఛాయా ( సంజ్ఞా దేవి ),  ఉషలు ఈయన భార్యలు. శనీశ్వరుడు, యముడు, యమున  ఈయన సంతానం  . 
లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిది ..రధసప్తమి .

 సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .

 రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .

ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు.  "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును బారతీయులే.

 మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్టీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము.

జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.

   "సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర 
సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ "

 అన్న ఈ శ్లోకమును రథసప్తమి రోజున పఠించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రథసప్తమి పుణ్యకాలమున అందరూ విధిగా పై శ్లోకమును పఠిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

మాఘశుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథ సప్తమి రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు తెలిపింది.  

 వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు.
 
 మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను (రేగుపండ్లు కూడా) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి వున్నాయి. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. 
 
 అందువలన రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేస్తారు. సప్త అశ్వములే సప్త స్వరములు, సప్త ఛందస్సులు, సప్త ఋషులు రథ సప్తమీ సూర్యారాధన- ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. తల స్నానం ముగించి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. 
 
 రథ సప్తమినాడు స్త్రీలు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం ⭕ వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి♨ , దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యధాశక్తిగా పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం. ఈ రోజున చేసే స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబులో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.

 పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.

 పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.

 మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒక చోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే నెత్తి మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

 ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.

యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ

 ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం . ' గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాకా' అని దీనర్ధం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రధం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....

పురాణాల ఆధారంగా...

 ఈ రోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు పూంచిన ఏకచక్ర రథం పై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టిన రోజు. రామాయణ , భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమేం ఉంది.

 రాముడిది రఘువంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్నమాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ' ఆదిత్య హృదయం 'గా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.

అటు భారతం లోనూ కర్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకపణిని , ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.

 ఈ రోజు ఖగోళ పరంగా

 సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవటం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది.

Related Posts