జగన్ అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సొంత గ్రామమైన నిమ్మకూరు లో జగన్ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలుగుదేశం గొంతులో వెలక్కాయ పడినట్లయింది. నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్ తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా పేరు మారుస్తామని నందమూరి సొంతఊరి ప్రజలకు హామీ ఇచ్చారు.వాస్తవానికి ఈ పని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చేయాల్సి ఉంది. నందమూరి తారకరామారావు పార్టీ పెడితే దానిని చేతుల్లోకి తీసుకున్నారన్న అపప్రథను ఇప్పటికే చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు మామను వెన్నుపోటు పెడిచి అన్న మాట ఇప్పటికీ ఏపీ ప్రజల చెవుల్లో అప్పుడప్పుడూ విన్పిస్తూనే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంటే అది వేరే విషయం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగి కూడా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. అయితే అన్నగారి పేరును మాత్రం కృష్ణా జిల్లాకు పెట్టకపోవడం పట్ల పార్టీలోనే విమర్శలు విన్పిస్తున్నాయి.ఈ పేరు పెట్టడానికి పెద్దగా ఖర్చు కాదు. ఎవరూ అభ్యంతరమూ పెట్టరు. పైసా ఖర్చులేని పనిని కూడా చంద్రబాబు నాలుగేళ్లు నాన్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో తమ్ముళ్లు కూడా అన్నగారి పేరు పెడతారని భావించారు. అదీ రాజధాని ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సముచితమన్నది తెలుగుదేశం నేతల అభిప్రాయం కూడా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు ఇప్పటికీ అంతర్గత సంభాషణల్లో ఎన్టీఆర్ పేరును స్మరిస్తూనే ఉంటారు. అలాంటిది నాలుగేళ్లు గడిచినా ఎన్టీఆర్ పేరు పెట్టకపోవడాన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు.తాజాగా జగన్ ప్రకటనతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయనే చెప్పాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమంలో ముందుకు వెళ్లేందుకు కష్టపడుతున్న టీడీపీ అధినేత నిజంగానే ఈ విషయాన్ని మర్చిపోయారా? కావాలని దాటేశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వారు తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు, మోడీతో చేతులు కలిపిన జగన్ ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు, ఎవరో చెబితే తాము వినాల్సిన అవసరం లేదని చెప్పటం విశేషం. అనవసర విషయాలు అంటే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అచ్చెన్న దృష్టిలో అనవసరమేనా? అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్ కృష్ణా జిల్లాలో భలే ఫిట్టింగ్ పెట్టారంటున్నారు.