YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మమ్మల్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? బెంగాలీల కోసం అవసరమైతే మోడీ కాళ్లపై పడతా ... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

మమ్మల్నెందుకు టార్గెట్ చేస్తున్నారు?  బెంగాలీల కోసం అవసరమైతే మోడీ కాళ్లపై పడతా ...  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

కోల్‌కతా మే 30,
 యాస్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి రగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మమత బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే చాలా సేపు వేచి ఉండేలా చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని, బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. మే 28న జరిగిన సంఘటనలను వివరించేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. బెంగాల్‌కు సాయం చేయాలంటే తన కాళ్ళు పట్టుకోవాలని మోదీ చెబితే, తాను బెంగాలీల కోసం తప్పకుండా ఆయన కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మమత బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
మమ్మల్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? ‘‘మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారు? మమ్మల్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? మమ్మల్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఎందుకంటే కేవలం బెంగాల్ ఎన్నికల్లో మీరు ఓడిపోయిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోవడంవల్లనే. బెంగాల్‌కు సాయం చేయాలంటే తన కాళ్ళు పట్టుకోవాలని పీఎం నాకు చెబితే, నేను బెంగాల్ ప్రజల కోసం, బెంగాల్ అభివృద్ధి కోసం  ఆ విధంగా చేయడానికి కూడా సిద్ధమే. అయితే ఇలాంటి కుళ్ళు రాజకీయ క్రీడలు మాత్రం ఆడవద్దు. బెంగాల్‌ను ఈ విధంగా శిక్షించవద్దు. చాలా శ్రమించి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవమానించవద్దు’’ అని మమత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నానని చెప్పారు. ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఇలా చేయడం ద్వారా మీరు దేశంలోని అందరు చీఫ్ సెక్రటరీలను అవమానిస్తున్నారు’’ అన్నారు.
సెలక్టివ్ న్యూస్‌తో తనను లక్ష్యంగా ఏకపక్ష వార్తలు
కేంద్ర ప్రభుత్వం సెలక్టివ్ న్యూస్‌తో తనను లక్ష్యంగా చేసుకుందని మమత ఆరోపించారు. ఆ వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా రాశారని దుయ్యబట్టారు. అందుకే తాను ఈ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశానని, జరిగిన విషయాలన్నీ చెప్పడానికే మాట్లాడుతున్నానని అన్నారు. తనకు జాతీయ స్థాయి మీడియాలో కొందరు మిత్రులు ఉన్నారని, కొన్నిసార్లు తమకు పీఎంఓ నుంచి సూచనలు వస్తూ ఉంటాయని వారు చెప్పారని అన్నారు. తనపై పక్షపాతంతో కూడిన వార్తలను రాయాలని పీఎంఓ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయని వారు చెప్పారన్నారు. ఆ వార్తల ఆధారంగా తనను అవమానించేందుకు ఇటువంటి సూచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం కూడా ఇదేవిధంగా సెలక్టివ్ న్యూస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు.
అకస్మాత్తుగా ఫోన్
యాస్ తుపానువల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తాను సాగర్, డిఘా వెళ్ళాలని నిర్ణయించుకున్నానని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తుపాను తర్వాతి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి బెంగాల్ వస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా తాము ప్రణాళికను రచించామని చెప్పారు.
ఓ గంటపాటు వేచి చూశాం
తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ముందు ఒక గంటపాటు తమను వేచి ఉండేలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేశారన్నారు. పీఎం హెలికాప్టర్ వస్తుందని చెప్పారని, తాము సహనంతో వేచి చూశామని చెప్పారు. ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరిగే ప్రదేశానికి తాము చేరుకునేసరికి, అక్కడ మోదీ సమావేశం అంతకుముందే ప్రారంభమైపోయిందని చెప్పారు. సమావేశం జరుగుతోంది కాబట్టి మీరు వెళ్ళకూడదని చెప్పారని, తనను బయటే నిలిపేశారని తెలిపారు. అప్పుడు కూడా తాము సహనంతో వేచి చూశామన్నారు. ఆ తర్వాత మళ్ళీ తాను అడిగినపుడు మరో గంట వరకు ఎవరూ లోపలికి వెళ్ళకూడదని చెప్పారన్నారు.
మేం వెళ్ళడానికి ముందే మోదీ సమావేశం ప్రారంభం
ఆ తర్వాత ఈ సమావేశం కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుందని ఎవరో చెబితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను అక్కడికి వెళ్ళామన్నారు. తాము అక్కడికి వెళ్ళేసరికి పీఎం మోదీ, గవర్నర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కొందరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు సమావేశమైనట్లు గుర్తించామన్నారు.
అంతకుముందు చెప్పినదానికి పూర్తి విరుద్ధం
ఈ పరిణామం తమకు అంతకుముందు చెప్పినదానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుందని అంతకుముందు చెప్పారన్నారు. ఈ సమావేశంలో ఇతరులు కూడా పాల్గొనడంతో నివేదికను సమర్పించాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి వద్ద అనుమతి తీసుకుని తాను డిఘాలో తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్ళానని వివరించారు. తాను ప్రధాన మంత్రి అనుమతిని మూడుసార్లు కోరానని చెప్పారు. ‘‘సార్, మీ అనుమతితో నేను వెళ్ళవచ్చునా? మేం డిఘా వెళ్ళి, తుపాను నష్టాన్ని అంచనా వేయవలసి ఉంది, వాతావరణం కూడా అంత బాగా లేదు’’ అని తాను మోదీతో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మాత్రమే తాము అక్కడి నుంచి డిఘా వెళ్ళామని తెలిపారు.
మూడుసార్లు మోదీ అనుమతి కోరాను
ఆ సమావేశ మందిరంలో కొన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని, అయితే తాము డిఘా వెళ్ళవలసి ఉన్నందువల్ల అక్కడ కూర్చోవలసిన అవసరం తమకు రాలేదని చెప్పారు. అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నట్లు ఓ ఫొటోను మీడియాకు విడుదల చేశారని, ఇది సరైనది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ తనను ఇలాగా టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి గుజరాత్, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినపుడు ప్రతిపక్షాల సభ్యులు హాజరు కాలేదని గుర్తు చేశారు. కానీ బెంగాల్‌లో మాత్రం ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారన్నారు. ‘‘మీరు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ మా ప్రభుత్వ కార్యకలాపాలను గందరగోళపరచడానికి ఏదో ఒకటి చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

Related Posts