YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

సోషల్ మీడియాపై కేంద్రం వైఖరి సరైందే: విజయశాంతి

సోషల్ మీడియాపై కేంద్రం వైఖరి సరైందే: విజయశాంతి

హైదరాబాద్ మే 30,
సోషల్ మీడియాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సమర్థించారు. ఈ మేరకు ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘సోషల్ మీడియాలో ఎవరెవరో, ఏవేవో పోస్టులు పెట్టడం.. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం.. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే.. సోషల్ మీడియా కంపెనీలకు కొత్త నిబంధనలు పెట్టడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. మన దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చడం, అత్యాచారాలు వంటి పలు రకాల నేరాలను ప్రేరేపించే ఏవైనా సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినపుడు, వాటిని ముందుగా పోస్ట్ చేసినవారి వివరాలు చెప్పాలని, శాంతిభద్రతలను దెబ్బతీసే పోస్ట్‌ల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కొత్త డిజిటల్ రూల్స్‌లో ఉందని మంత్రి విపులంగా చెప్పారు’’ అని ట్వీట్ చేశారు.
ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని విమర్శిస్తున్నవారికి ఇదే సోషల్ మీడియాపై చైనా ఏ విధంగా ఉక్కుపాదం మోపిందో తెలియదా అని ప్రశ్నించారు. తన సొంత సోషల్ మీడియా సైట్లను మాత్రమే ఉపయోగించేలా ఆ ప్రభుత్వం ఎలా కట్టడి చేసిన వైనాన్ని గుర్తు చేశారు. దీని గురించి ఒక్కరూ మాట్లాడరని, భావప్రకటన స్వేచ్ఛ మన దేశంలో ఉన్నంతగా మరెక్కడా లేదన్నది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో కూడా రాజీ పడేలా కొన్ని వర్గాలు వ్యవహరించడం నిజంగా దురదృష్టకరమని వాపోయారు. తాను గతంలో ఎన్నోసార్లు ఈ మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలియజేశానన్నారు. సరైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.

Related Posts