కోల్‌కతా మే 30,
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసపై కేంద్ర హోంశాఖకు కమిటీ తన నివేదికను సమర్పించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో నిజా నిజాలపై కేంద్ర హోంశాఖ ఓ కమిటీని ఏర్పర్చింది. ఇందులో మేధావులతో పాటు నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా దీనికి నేతృత్వం వహించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి, తన రిపోర్టును కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అందజేసింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మమత వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడ్డారు. బెంగాల్‌లో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తోందని, పోలీసులు తృణమూల్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడానికి బెంగాల్‌లో ఏం చేయాలన్న దానిపై తాము త్వరలోనే చర్చించి, నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఫలితాలు వచ్చి ఇన్ని రోజులు గడిచినా, హింస ఇంకా కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత తలెత్తిన హింసపై కమిటీ తన రిపోర్టును కేంద్ర హోంశాఖకు సమర్పించిందని కిషన్ రెడ్డి ప్రకటించారు.