అమరావతి మే 30,
కరోనాకు మందు పంపిణీ చేస్తున్న కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయనను తీసుకెళ్లారు. మరో వైపు మందు కోసం కృష్ణపట్నానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ నిలిపివేయడంతో ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది.ఔషధంపై సోమవారం నివేదిక రానుండగా.. అప్పటి వరకు రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కృష్ణపట్నంలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా.. విజయవాడ పరిశోధన కేంద్రం ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌కు సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారని సమాచారం.