తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు అట్టుడికిపోతున్నాయి. అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. ఇప్పుడే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని ఠారెత్తిపోతున్నారు. రోహిణీకార్తెను తలచుకుని మరీ భయపడిపోతున్నారు. తెలంగాణ జిల్లాల్లో, హైదరాబాద్‌లో అయితే సూరీడు చండప్రచండంగా చెలరేగిపోతున్నాడు. మేడిపల్లిలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే... హైదరాబాద్‌లో ఏకంగా 42డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇవాళ్టి నుంచి మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు.హైదరాబాద్‌లో భానుడు భగభగలకు నగరవాసులు తాళలేకపోతున్నారు.38,39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి 42డిగ్రీలకు చేరుకోవడంతో... హైదరాబాదీలు బెంబేలెత్తిపోతున్నారు. పలుచోట్ల నగరంలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి ఈ ఏప్రిల్‌లోనే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో 19౭౩ఏప్రిల్ 30న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇప్పటివరకు నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు. ఇప్పుడా రికార్డుకు దరిదాపుల్లో నగరంలోని పలుప్రాంతాల్లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. ఒకే ఒక్క రోజు వ్యవధిలో నగరంలో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో... ప్రజలు రోడ్లపైకి రావాడమే మానేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.ముషీరాబాద్, మైత్రీవనం, బండ్లగూడ, శ్రీనగర్కాలనీ, గోల్కొండ. అంబర్‌పేట, జూబ్లీహిల్స్, మణికొండ, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రోజూ ఉదయం9,10 గంటల నుంచే సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఎండ వేడి కొనసాగుతోంది. పగలు రోడ్డెక్కితే మాడిపోయేలా చేస్తున్న సూర్యుడు....ఇంట్లో ఉంటే ఉక్కపోతతో వేధిస్తున్నాడు. గాలిలో తేమ 24శాతం వరకు తగ్గిపోయింది. దీంతో చెమట్లకు చిర్రెత్తిపోతున్నారు నగరవాసులు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అయితేనే రోడ్డు ఎక్కుతున్నారు.