YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబుకు వరుస పెట్టి గుడ్ న్యూస్ లు

బాబుకు వరుస పెట్టి గుడ్ న్యూస్ లు

విజయవాడ, మే 31, 
చంద్రబాబు అంటేనే అదృష్టానికి మారు పేరుగా చెప్పుకోవాలి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి సుమారుగా పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ప్రజాదరణ ఉన్న టంగుటూరి ప్రకాశం, ఎన్టీయార్, వైఎస్సార్ లాంటి వారు అతి తక్కువ కాలమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మరి ఈ పోలికను చూసుకున్నపుడు చంద్రబాబుకు దేవుడు ఏదో వరమే ఇచ్చి ఉంటారని అనిపిస్తుంది. సరే నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇంకా నాటౌట్ అంటున్నారు. చాన్స్ వస్తే మళ్ళీ సీఎం కావాలని, ఇంకా అదృష్టం నెత్తిన పాలు పోస్తే నేరుగా ప్రధాని కావాలన్న బోలేడు ఆశలు బాబులో ఉన్నాయి మరి.ఈ మధ్య కొన్ని కేసులు ఇబ్బంది పెడతాయని ఆయన ప్రత్యర్ధులు బాగా ఆశపడ్డారు. ఆరు నెలల మించి ఏ కేసులో కూడా స్టేలు ఉండకూడదు అన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అపుడెపుడో లక్ష్మీపార్వతి చంద్రబాబు మీద వేసిన కేసు బయటపడింది. బాబు ఆదాయాన్ని మించి ఆస్తులు కూడబెట్టారు అంటూ ఆమె 2005లో వేసిన కేసు మళ్ళీ ఏసీబీ కోర్టులో విచారణకు వస్తే ఏదో జరిగిపోతుంది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమె ఇపుడు అధికార వైసీపీలో కీలక హోదాలో ఉన్నారు. కానీ ఈ కేసులో సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు కొట్టేసింది. మొత్తానికి ఇక్కడ కూడా చంద్రబాబుకి గుడ్ న్యూసే వచ్చింది.ఇక అతి కీలకమైన కేసు మరోటి ఉంది. అదే ఓటుకు నోటు కేసు. ఈ కేసు వల్లనే చంద్రబాబు జాతకంతో పాటు ఏపీ జాతకం కూడా రివర్స్ గేర్ లోకి వెళ్ళిందని ఇప్పటికీ చెబుతారు. ఈ కేసులో బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు బాబూ అంటూ 2015లో ఒక అర్ధరాత్రి వేళ హడావుడిగా మీడియా మీటింగ్ పెట్టి మరీ కేసీయార్ గర్జించారు. కానీ ఆరేళ్ళుగా ఎలాంటి కదలికా లేని ఆ కేసు తాజాగా విచారణకు నోచుకుంది. ఇక ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. దాంతో బ్రీఫ్డ్ మీ అన్న బాబుని మీద కూడా చార్జిషీట్ వేస్తారని అంతా ఊహించారు. చిత్రంగా రేవంత్ రెడ్డి ఈ కేసులో ఏ వన్ ముద్దాయి గా ఉన్నారు. మిగిలిన వారి పేర్లు ఉన్నాయి తప్ప చంద్రబాబు ప్రసక్తి ఎక్కడా లేదు. దీంతో టీడీపీ శ్రేణులు పండుగనే చేసుకుంటున్నాయి.చంద్రబాబు మీద ప్రత్యర్ధులు ఎన్ని అనుకున్నా అనుకోవచ్చు కానీ. ఆయన్ని ఈ రోజుకు ఎవరూ కోర్టు మెట్లు ఎక్కించలేకపోయారు. ఇది కఠిన వాస్తవం. ఆయన మీద 18 కేసుల్లో స్టేలు ఉన్నాయని అంటారు. కానీ స్టేలు వేకేట్ అయిన కేసుల్లో కూడా ఆయన తప్పుని నిరూపించలేకపోతున్నారు. చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తాడని ఆడిపోసుకోవడమే తప్ప ఆయన్ని ఏమీ అనలేకపోతున్నారు ప్రత్యర్ధులు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు అత్యధిక కాలం సీఎం గా పనిచేశారు. ఆయన టైమ్ లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అలాగే రెండెకరాల ఆసామి నుంచి వేల కోట్లకు అధిపతిగా బాబు మారారు అని ప్రత్యర్ధులు అంటారు. ఎన్ని మాటలన్నా కూడా బాబు మాత్రం కడిగిన ముత్యంగానే ఉన్నారు. మరి ఆయన సామర్ధ్యానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి.

Related Posts