తిరుపతి, మే 31,
రైతులు పండించిన పంటల విక్రయాలకు ఏర్పాటు చేయ దలిచిన ఇ-ప్లాట్‌ఫారం (ఎలక్ట్రానిక్ వేదిక) నిర్వహణా బాధ్యతలను చక్కబెట్టడానికి కేంద్రం ఆదేశించిన మేరకు స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి)ను నెలకొల్పేందుకు అనుమతించింది. 'ఆంధ్ర ప్రదేశ్ రైతుల ఇ- విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్' పేరుతో 2013 కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించేందుకు సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. పది లక్షల షేర్ కేపిటల్‌తో కంపెనీని నెలకొల్పుతామని, తొలుత రూ.లక్ష మూలధన పెట్టుబడి పెట్టనున్నామని పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ ఈక్విటీతో రిజిస్ట్రేషన్ చేసే కంపెనీకి వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎపి రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కాగా వ్యవసాయ, హార్టికల్చర్ కమిషనర్లు, మార్క్‌ఫెడ్ ఎమ్‌డి డైరెక్టర్లుగా ఉంటారు. వారి పేరుతో ఒక్కో షేరు పెడతారు. ఈ తతంగం కోసం కేంద్రానికి చెందిన సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ రూ.12.51 కోట్లు విడుదల చేయాలని మార్కెటింగ్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఈ కొత్త కార్పొరేషన్ కేంద్రం నుండి నిధులు పొందడానికేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న చర్చ సాగుతోంది. కార్పొరేషన్ వచ్చాక వ్యవసాయ మార్కెట్ కమిటీల పాత్ర ఏమిటి, మద్దతు ధరల మాటేమిటీ అన్నవీ అనుమానాలే! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులంతా వ్యతిరేకిస్తున్న వేళ రాష్ట్రంలో ఆ చట్టాల్లోని వివిధ అంశాల అమలుకు చాప కింద నీరులా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఏర్పాట్లు చేస్తోందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాగుంటూరులో ఏర్పాటు చేసే ఇ-ప్లాట్‌ఫారం... రైతులు, దేశ వ్యాప్తంగా, దేశం వెలుపల ఉన్న ట్రేడర్ల మధ్య వాణిజ్యం సులభతరం చేస్తుందని జిఓలో తెలిపారు. కొత్తగా నెలకొల్పే కార్పొరేషన్ ఇ-ప్లాట్‌ఫారం నిర్వహణ, బోర్డింగ్‌ల నిరంతర పర్యవేక్షణ, ఫారమ్ గేట్ వెలుపల రైతులకు, బయ్యర్లకు జరిగే కొనుగోళ్లు, అమ్మకాలు ఇత్యాది వ్యాపార లావాదేవీలకు ఏర్పాట్లు, రవాణా, చెల్లింపులు, ఒప్పందాల విషయంలో వివాదాల పరిష్కారం వంటి వాటిని చూస్తుందిగ్రామాల్లోనే రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలూ ఒకే గొడుగు కింద లభిస్తాయంటూ ఏడాది క్రితం సర్కారు రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)ను నెలకొల్పిన విషయం తెలిసిందే. వాటికి అనుసంధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల (ఎంపిఎఫ్‌సి)ను ఏర్పాటు చేస్తోంది. ఆ సెంటర్ల పరిధిలో నిర్మించే వ్యవసాయ ఉత్పాదకాల నిల్వ ప్రదేశాలు, పంటల నిల్వకు గోదాములు, శీతల గిడ్డంగులు, యాంత్రీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో రూ.2,718 కోట్లు ఖర్చవుతాయని ప్రాజెక్టు అంచనాలు రూపొందించారు. దానిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.264 కోట్లు, కేంద్రం వాటా 74 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.18.91 కోట్లు, రుణం రూ.2,361 కోట్లు అని ప్రతిపాదనలు చేశారు. గతేడాది కోవిడ్ మొదటి దశ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకంటూ కేంద్రం 'ఆత్మ నిర్భర్ భారత్' ప్యాకేజిని ప్రకటించింది. దానిలో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఎఐఎఫ్) ఉంది. ఎఐఎఫ్ నిధులు కావాలంటే కేంద్రం వ్యవసాయ పంటల కొనుగోలుకు నెలకొల్పిన ఇ-ప్లాట్‌ఫారంలో రాష్ట్రాలు చేరాలంది. ఎఐఎఫ్ నిధుల కోసం సర్కారు ఆర్‌బికెలను, వాటికి అనుసంధానంగా మల్టీపర్పస్ సెంటర్లను, ఇ-ప్లాట్‌ఫారంను దశల వారీగా నెలకొల్పుతోందని తెలుస్తోంది. దానిలో భాగంగానే కేంద్ర నిధులు, రుణాల కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (కార్పొరేషన్) ఏర్పాటైంది. ఈ సంవత్సరం మార్చి 24న మల్టీపర్పస్ సెంటర్ల ప్రాజెక్టు అంచనాలకు సంబంధించిన జిఒనెం12లో ఈ విషయాలు చూచాయగా ఉన్నాయి. ప్రాజెక్టు అమలు ఏజెన్సీకి 'ఆత్మ నిర్భర్', ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలతో నెలకొల్పిన అగ్రి ఇన్‌్‌ఫ్రా ఫండ్ నుండి ప్రాజెక్టు విలువలో పది శాతం రూ.251.69 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సదరు ఏజెన్సీని నెలకొల్పుతున్నారు.