పుదచ్చేరి, మే 31,
అనుచరులు, సహచరులు, వంది మాగంధులు, అధికార దర్పం…. ఇదీ దేశంలో ముఖ్యమంత్రి పేరు చెప్పగానే మనకు కనపడే లక్షణాలు. అప్పటిదాకా సామన్యుడుగా ఉండే నాయకుడు సైతం అధికారం చేపట్టగానే ఒక్కసారి మారిపోతాడు. అతని వేషభాషల్లో మార్పు కనపడుతుంది. అతని వ్యవహారశైలిలో విస్పష్టమైన మార్పు కనపడుతుంది. తీరుతెన్నుల్లో తేడా కనపడుతుంది. అధికారం శాశ్వతమని భావిస్తుంటాడు. తనకు తిరుగులేదని, ఎదురు లేదని తలపోస్తుంటాడు. అందినకాడికి సంపద సమాకూర్చుకోవాలని ఆరాట పడుతుంటాడు. అందరినీ దూరం పెడుతుంటాడు. తన వారసులను తెరపైకి తెచ్చేందుకు, వారిని తీర్చిదిద్దేందుకు తపిస్తుంటాడు. రాష్ర్ట ప్రగతి, ప్రజా సంక్షేమం అతనికి ద్వితీయ ప్రాధ్యాన్యాలుగా మారిపోతాయి. ఇందుకు భిన్నంగా ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటారు. వారిలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి మొదటివాడని చెప్పకతప్పదు. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రంగసామి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. అవినీతికి హంగు ఆర్భాటాలకు ఆమడ దూరం. నిరంతరం ప్రజా సంక్షేమానికి పరితపిస్తుంటారు. వారి బాగోగులు తప్ప మరో ధ్యాస ఉండదు. అందుకే ఆయనను అక్కడి ప్రజలు‘మక్కళ్ ముదల్వర్’ (ప్రజా ముఖ్యమంత్రి) అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రంగసామి విలక్షణ నాయకుడు. ప్రజలు ఆయన్ను ఎప్పుడైనా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కలుసుకోవచ్చు. తమ సాధక బాధలను తెలియజేయవచ్చు. ఆయన అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారు. పుదుచ్చేరి వీధుల్లో రంగసామి ఓ సామాన్యుడిలా కాలినడకన సంచరిస్తుంటారు. రోడ్డు పక్కన దుకాణాల్లో తేనీరు సేవిస్తుంటారు. చిన్నారులతో సరదాగా మాట్లాడుతుంటారు. అంతేతప్ప విసుక్కోవడం, కోప్పడటం ఆయనకు తెలియని విద్య. ఒక సాధారణ వ్యక్తిగాతన సొంత మోటారు బైకుపై సచివాలయానికి వెళుతుంటారు. ఈ మంచి లక్షణాలే ఆయనను నాలుగోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. ఒకప్పటి కాంగ్రెస్ వాది అయిన రంగసామి ఆ పార్టీ ఒంటెత్తు పోకడలతో విసిగి ఆలిండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ పేరుతో 2011లో సొంత పార్టీ స్థాపించారు. వరుసగా 1991, 1996, 2001, 2006, 2021ల్లో తట్టం చావడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011, 2016ల్లో ఇందిరానగర్ నుంచి విజయం సాధించి శాసనసభలోకి అడుగుపెట్టారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విద్య, వైద్య, సహకార శాఖల మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజలకు చేరువయ్యారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, పేదలకు పింఛన్లు, వైద్య సౌకర్యం, ఉచిత విద్య వంటి కార్యక్రమాలద్వారా పేద ప్రజల మనసుల్లో చోటు సంపాదించు కున్నారు. మొన్నటి ఎన్నికల్లో 16 సీట్లలో పోటీచేసిన రంగసామి పార్టీ 10 సీట్లలో విజయం సాధించిఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 20.85 శాతం ఓట్లను సాధించింది. తట్టంచావడితో పాటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ సమీపంలోని యానాం నుంచి కూడా రంగసామి పోటీ చేశారు. తట్టంచావడిలో విజయ కేతనం ఎగురవేశారు. స్థానికంగా పట్టున్న మాజీ ఎమ్మేల్యే మల్లాడి క్రిష్ణారావు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ ఓడిపోయారు. ఆరుగురు ఎమ్మెల్యేలున్న భారతీయ జనతా పార్టీ మద్దతుతో రంగసామి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. అవివాహితుడైన ఆయన పరమ దైవభక్తుడు. రోజూ తన ఇంటి సమీపంలోని గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో పేదలకు అన్నదానం చేస్తుంటారు. భాజపా మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసిన రంగసామికి భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి ముప్పు లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.