YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరుమారీ దేవి, తమిళనాడు లోని తిరువేర్కడు.

కరుమారీ దేవి, తమిళనాడు లోని తిరువేర్కడు.

కరుమారీ దేవి ఎవరు? ఎక్కడ కొలువై ఉంది ?
కరుమారీ దేవి శక్తి అవతారాలలో ఒక దేవత. ఆమె ఉమాదేవి అంశ. తమిళనాడు లోని తిరువేర్కడులో కరుమారీ దేవి కొలువై ఉంటుంది. కరుమారీ దేవి సకలరోగాలను బాపే చల్లనితల్లి. ఆమె సకల విద్యాదాయిని. నమ్మివచ్చిన భక్తులకు ఆమె రక్షగా ఉండి కష్టాలను తీర్చి కాపాడుతుంది.
కరుమారీ దేవి విశిష్టత
దక్షిణ భారతదేశం లో అంతుపట్టని విషవ్యాధి ప్రబలింది. ఆ సమయం లో ఉమారూపిణి అయిన కరుమారీ అమ్మ వెలసి చెరుకు దండాన్ని చేపట్టి ఆ భయంకరమైన అంటువ్యాధిని పారద్రోలి ప్రజలను కాపాడింది. తన అన్న అయిన తిరుమల వాసుని తనతో పాటుగా అక్కడ నిలిచి భక్తుల కోర్కెలను తీర్చమంది. అప్పటినుండీ తిరుమలేశుని అంశ కరుమారీ దేవితో పాటుగా అక్కడ నిలిచి ఉంది. భక్తుల ఆపదలను తీరుస్తూ ఆ అన్నా చెల్లెళ్ళు తిరువేర్కడులో వెలసి ఉన్నారు. ఇప్పటికీ దీర్ఘ కాలిక రోగాలతో బాధపడేవారు కరుమారీ అమ్మకు చేరుకుగడలను సమర్పించుకుంటారు. చెరుకు గడలను సమర్పించిన వారికి కరుమారీ దేవి ఎటువంటి వ్యాధినైనా తొలగిస్తుందని భక్తుల నమ్మకం.
విద్యాదాయిని కరుమారి
ఒకనాడు దేవలోకం లో నారదాదుల గానం ఏర్పాటుచేయబడింది. అప్పుడు నారదాదులు సరస్వతీదేవికి అగ్ర తాంబూలం ఇవ్వబోగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. తానింకా విద్యలను నేర్చుకునే దశలోనే ఉన్నాననీ, ఎల్లవిద్యాలకూ ఆద్యురాలు కరుమారీ దేవి కనుక ఆమెకే అగ్ర తాంబూలం దక్కాలనీ సరస్వతీదేవి కోరింది. ఆమె కోరికమేరకు దేవతలంతా కరుమారీ దేవికి తాంబూలమిచ్చి అగ్ర సింహాసనాన్ని అధిష్టింపజేశారు. అమ్మకు తాంబూలం అంటే ఎంతో ప్రీతి. అమ్మవారికి తమలపాకుల దండలూ, తాంబూలం ఇక్కడి భక్తులు సమర్పించుకుంటారు. అమ్మవారు కోటి సూర్య ప్రభాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకనాడు ఆమెను ధిక్కరించి సూర్యుడు అపాయం కొనితెచ్చుకున్నాడు.
అమ్మను ధిక్కరించిన సూర్యుని గతి ఏమయింది?
అమ్మవారు ఒకనాడు వృద్ధ స్త్రీ వేషం లో సూర్యుని వద్దకు వెళ్లింది. అతని జాతకం చెబుతానని స్వయంగా అమ్మే ఆ సూర్యుని అడిగింది. పండు ముసలి, పైగా స్త్రీ తన జాతకం చెప్పడం ఏమిటని చులకన చేశాడు సూర్య భగవానుడు. వచ్చింది కరుమారీ దేవి అని తెలియక ఆమెను హేళన చేసి ధిక్కరించాడు. సూర్యుని మిడిసిపాటుకు ఆగ్రహించిన అమ్మ అతని కాంతిని హరించివేసింది. తప్పు తెలుసుకున్న సూర్యుడు రక్షించమని అమ్మను వేడుకున్నాడు. అప్పుడామే కరుణించి అతని కాంతిని తిరిగి ప్రసాదించింది. అప్పటినుండీ ఆదివారం కరుమారీ దేవికి అంకితమిచ్చాడు సూర్యుడు. సంవత్సరం లో రెండుసార్లు అంటే పుష్య మాసం లోనూ భాద్రపద మాసం లోనూ సూర్య భగవానుడు అమ్మవారికి తన కిరణాలతో అభిషేకం చేస్తాడు. ఆ సమయం లో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు చేస్తారు. శీఘ్ర వివాహానికి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే విధానం ఒకటి ఉంది. తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళ నాడు లోనూ ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతోమంది శుభాలను పొందారు.
వేపచెట్టులో కొలువైన కరుమారి దేవి
తాను వేప చెట్టులో కొలువై ఉంటానని కరుమారీ దేవి స్వయంగా చెప్పింది. వేప ఔషధ గుణాలలో మేటి. వేప చెట్టు ఆరోగ్యానికి ప్రతీక. అందుకే వేపచెట్టులోని ప్రతి ఆకులోనూ తాను కులువై ఉంటానని అమ్మవారి ఉవాచ. తిరువేర్కడు ఆలయం లోని వేపచెట్టు అమ్మవారి రూపంగా భక్తులు కొలుస్తారు.
కార్తవ రాయని శాపాన్ని తొలగించిన కరుమారీదేవి
కాశీకి అధిపతి అయిన తులసీ రాజుకు ఆయన పట్టపురాణి కర్పూరవల్లికీ జన్మించిన సంతానం కార్తవ రాయుడు. అతను పుట్టగానే జ్యోతిష్యులు అతని జాతకాన్ని చూసి, ఈ పిల్లవాడు పెరిగిన నేల అనావృష్టితో, కరువుతో నాశనమవుతుందని చెబుతారు. అతని జాతక దోషాన్ని పోగొట్టడానికి కర్పూరవల్లి మరియు తులసీ రాజు కరుమారీ దేవిని వేడుకున్నారు.
కార్తవీర్యుడు పూర్వజన్మలో పరమశివుని మూడవకంటి కాంతినుండీ ఉద్భవించినవాడు. అతనిని గంగా నదికి కాపలాదారుగా అమ్మవారు నియమించింది. ఒకనాడు అతను గంగానదిలో స్నానమాడుతున్న స్త్రీల వస్త్రాలను అపహరించాడు. ఆ దుశ్చర్యకు శిక్షగా అతనిని ఏడుసార్లు భూమిపై జనన మరణాలను పొందమని అమ్మ శపించింది. అతనే తులసీరాజుకుమారునిగా ఏడవ జన్మను పొందాడు.
తులసీ రాజు తన సంతానం వల్ల రాజ్యం నాశనం కాకూడదని ఆ పిల్లవాడిని శూలంపై పడవేసి చంపివేయమని ఆదేశించాడు. శూలం తాకగానే మరణ బాధతో విల విలలాడిన ఆ పసిబాలుని రూపం లోని కార్తవీర్యుని కరుమారీ దేవి క్షమించి జీవితాన్ని ప్రసాదించింది. ఇలా కరుమారీదేవి లీలలు లెక్కకు మిక్కిలి.
అమ్మవారి సన్నిధిలోని ఆలయాలు
అమ్మవారి సన్నిధిలో వినాయకుని మందిరం, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని మందిరం, సీతారాముల మందిరం, వెంకటేశ్వరుని ఆలయం, సప్తమాతృకల మందిరం ఉన్నాయి. ఇక్కడి గాజుమంటపం అత్యంత రమణీయమైనది.
ఓం నమో నారాయణాయ

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts