ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 12ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చింది. అయినా సరే అలాంటి నేరాలు మాత్రం ఆగటం లేదు.మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చట్టాలను తీసుకొస్తున్నా దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఆడపిల్లలు ఆ మానవ మృగాల అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా బిహార్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై ఎనిమిది మంది వేధింపులకు పాల్పడ్డారు.బిహార్‌లోని జెహనాబాద్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బాలికను అటకాయించిన ఎనిమిది మంది యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె వారిని అడ్డుకోడానికి ప్రయత్నించగా ఆ యువకులు బాలిక దుస్తులను చించేశారు. ఆమె కాలును పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ వారి ఆగడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. బాలికకు సాయం చేయాల్సింది మాని ఫోన్లలో వీడియోలు తీశారు. అనంతరం సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు.ఈ వీడియో వైరల్ మారి పోలీసుల దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వీడియో ఎవరు పోస్టు చేశారు.. ఏ మొబైల్ నుంచి చేశారు అన్న దానిపై ఆరా తీశారు. ఎట్టకేలకు ఆ వీడియో తీసిన వ్యక్తిని గుర్తించి ఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టి నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.