చిత్తూరు జిల్లా పశ్చిమాన తెలుగుదేశం పార్టీలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఏ పాత్ర పోషించబోతున్నారు? అధికారపార్టీ ఆయనకి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోంది? కిషోర్‌ని తెలుగు దేశంపార్టీ తెరపైకి తేవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?
చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పేరుపొందిన కుటుంబాల్లో నల్లారి కుటుంబం ఒకటి. జిల్లాలోని నగరిపల్లె వారి సొంతూరు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి హయాం నుంచి అంటే సుమారు 60 ఏళ్ళుగా కాంగ్రెస్‌పార్టీతో వారికి అనుబంధం ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలతో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి! అందుకే నల్లరి కుటుంబానికి కాంగ్రెస్‌పార్టీలో ఎనలేని ప్రాధాన్యం ఉండేది. కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి చిత్తూరుజిల్లాలో సీనియర్ నేతల్లో ఒకరు. అప్పట్లో ఆయన మాటకు తిరుగుండేది కాదు. 1962లో వాయల్పాడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు దఫాలు మంత్రి పదవులు చేపట్టారు. 1987లో అమర్‌నాథ్‌రెడ్డి కన్నుమూశారు.
ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి విషయానికి వస్తే.. చిన్నప్పటినుంచి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన రాజకీయ వారసుడుగా 1989లో తెరపైకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగారు. పలుమార్లు చట్టసభకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో పీలేరు నుంచి గెలిచిన తర్వాత ఆయన స్పీకర్ పదవి దక్కింది. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఆయనే చివరి ముఖ్యమంత్రి. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. తద్వారా నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కిరణ్ సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి పీలేరులో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నల్లారి కుటుంబానికి చెందిన అనుచరులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల్లోనూ స్తబ్దత నెలకొన్నది. అప్పట్లో కిరణ్ సోదరులు బీజేపీలో చేరతారని కొన్నాళ్లు, టీడీపీలో చేరతారని మరికొన్నాళ్లూ ప్రచారం సాగింది. అయితే దీనిపై వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది చివరిలో మాత్రం.. కిరణ్ తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం!
చిత్తూరు జిల్లా పడమటలో ప్రత్యేకించి పీలేరు నియోజవర్గంలో టీడీపీ బలహీనంగా ఉంది. గత నాలుగు ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. దీంతో స్థానికంగా టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఈ తరుణంలో కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలోకి చేరడంతో అకస్మాత్తుగా ఆ పార్టీ బలం పుంజుకుంది. గత ముప్పయ్యేళ్లుగా ఇక్కడి రాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పుతూ వచ్చిన ఆయన 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన చివరికి తెలుగుదేశం కండువా కప్పుకోవడంతో పీలేరులోని రెండు బలమైన సామాజికవర్గాలు ఒక్కటయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆయనని పార్టీలో చేర్చుకునే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సమయం, ఇచ్చిన ప్రాధాన్యం వంటివి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో తమ నేతకు సముచిత గౌరవం లభించిందని ఆయన అనుచరులు, అభిమానులు ఎంతో ఆనందించిన మాట వాస్తవం.
స్థానికంగా బలమైన నాయకత్వం కొరవడి సతమతమైన టీడీపీ శ్రేణులు కూడా కిషోర్‌కుమార్‌రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతించాయి. అంతేకాదు- పార్టీలో చేరిన స్వల్ప వ్యవధిలోనే ఆయనకు చంద్రబాబు ఐడీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామంతో పార్టీలోని పాత, కొత్త శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఐడీసీ ఛైర్మన్ హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
కిషోర్‌కుమార్‌రెడ్డికి టీడీపీలో ప్రాధాన్యం కల్పించడం వెనుక బాబు ఉద్దేశం వేరుగా ఉందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే బాబు లక్ష్యమని కొందరు చెబుతున్నారు. దీంతోపాటు చిత్తూరుజిల్లా పశ్చిమాన తెలుగుదేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలన్నది కూడా బాబు వ్యూహమని మరికొందరు అంటున్నారు. అక్కడ అనేక ఏళ్లుగా పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్నదే టీడీపీ పెద్దల ఆలోచన అని విశ్లేషిస్తున్నారు. గతంలో పీలేరు నుంచి, ప్రస్తుతం పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డికి ఇప్పటికీ పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో బలమైన వర్గం ఉంది.
రాజంపేట ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి, నల్లారి కుటుంబానికి తొలినుంచి సదుం, సోమల మండలాల్లో గణనీయమైన పలుకుపడి ఉంది. మదనపల్లె, తంబళ్ళపల్లెలోను అనుచరవర్గం బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొంతమేరకు అధికారంతో కూడా తోడు కావడంతో పుంగనూరులో పెద్దిరెడ్డిని, రాజంపేటలో మిథున్‌రెడ్డిని దెబ్బతీసి ఆయా స్థానాల్లో పసుపుపచ్చ జెండా ఎగిరేలా చేయాలన్నది టీడీపీ హైకమాండ్ పట్టుదల అని చెప్తున్నారు! ఇందుకోసమే నల్లారి కుటుంబాన్ని ఇలా తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. ఈ కారణంగానే నల్లారి కుటుంబాన్ని చంద్రబాబు టీడీపీలోకి తీసుకువచ్చి పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం తనకు కల్పించిన అవకాశాలను కిషోర్‌కుమార్‌రెడ్డి ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారు? ప్రత్యర్థి కుటుంబ ఆధిపత్యానికి ఎంత వరకూ చెక్ పెట్టగలరు? అన్న విషయాలపై జిల్లాలో వాడివేడి చర్చ జరుగుతోంది. చూద్దాం వచ్చే రోజుల్లో ఎవరు ఎవరిపై పైచేయి సాధించగలరో..!