కర్నూలు, జూన్ 2,
ఏపీలో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇందులో కొత్త ఏముంది ? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటేనో.. లేక మరేదైనా వివాదం చేసుకుంటేనో.. కదా రాజకీయంగా హైలెట్ అయ్యేది అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది.. కీలక విషయం. ఎవరికి వారు సైలెంట్‌గానే ఉండడం వెనుక కూడా రాజకీయం ఉందని చెబుతున్నారు పరిశీలకులు. ఇరు పార్టీల్లోనూ ఒక విధమైన స్తబ్దత కొనసాగుతోందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. రెండు పార్టీల అధిష్టానాలేనని అంటున్నారు.టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. పార్టీ తరఫున ఇక్కడ కీలక నేతలు ఉన్నప్పటికీ.. ఎవరినీ.. పార్టీ అధినేత చంద్రబాబు పట్టించు కోవడం లేదు. కర్నూలు నగర పార్టీ ఇంచార్జ్ అధికార పార్టీ నేతలతో కలిసిపోతున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇక్కడ తండ్రి, కుమారుడు చెరో పార్టీలో ఉన్నా కూడా పార్టీ ఇన్‌చార్జ్ భరత్‌ను పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. దీంతో స్థానికంగా నేతలు.. ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. ఇక, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విషయం తీసుకున్నా.. ఆమె దూకుడు ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అయితే.. తెలంగాణలో చోటు చేసుకున్న అపహరణ కేసులో అరెస్టు కావడంతో కొంత వరకు సైలెంట్ అయ్యారు. కానీ, తర్వాత.. మళ్లీ పుంజుకున్నా చంద్రబాబు, పార్టీ అధిష్టానం కష్టకాలంలో తనను పట్టించుకోలేదన్న ఆవేదనలో ఆమెలో బాగా ఉందటనంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీలో ఉన్నట్టా ? లేనట్టా ? అని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రెండు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు అయిన నందికొట్కూరు, కోడుమూరులో పార్టీ నేతలు అసలు ఉన్నారా ? అన్న సందేహాలు ఉన్నాయి. కేఈ శ్యాంబాబు కూడా ఎక్కువుగా హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీని నడిపిస్తోన్న పరిస్థితి. ఉన్నంతలో మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు. కోట్ల ఫ్యామిలీ కాలం కలిసి రాదా ? అని వెయిటింగ్‌లో ఉంది. దాదాపు 10 నియోజకవర్గాల్లో పార్టీ పడకేసింది.ఇక, వైసీపీని తీసుకుంటే.. ఈ పార్టీలోనూ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆధిపత్య ధోరణులు పార్టీని మరింతగాఇబ్బంది పెడుతున్నాయి. ఎక్కడా సఖ్యత లేదు.. ఎవరూ కలిసి రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. జిల్లాలో అందరూ పార్టీ నేతలు కావడంతో బండి ఓవర్ లోడ్ అయ్యింది. ఇక మంత్రులు, కీలక నేతల మధ్య పైకి కనిపించని గ్యాప్ ఉంది. వాస్తవం ఎలా ఉన్నా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు అధిష్టానంతో గ్యాప్ పెరిగిందనే అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర పూర్తిగా నామమాత్రం. ఏదేమైనా కీలక జిల్లాలో వైసీపీ, టీడీపీ ల్లోనూ స్తబ్దత నెలకొంది.