YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదంలో ఆక్వా జోన్

ప్రమాదంలో ఆక్వా జోన్

జిల్లాలో ఇటీవలి కాలంలో ఆక్వా సాగు ఊపందుకుంది. ఆక్వాలో పురుగు మందుల వినియోగం, యాంటీ బయాటిక్స్‌ వాడకం అధికమవడంతో ఈ రంగం ప్రమాదకర స్థితికి చేరింది. దీని ప్రభావం ఎగుమతులపై పడుతోంది.అమెరికా, యూరోపియన్‌ దేశాల మార్కెట్ల నుంచి ప్రతికూలత ఎదురవుతోంది. సాగునీటి వనరులు కలుషితం అవడంతో పాటు వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతున్నాయని రైతుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆక్వా జోన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లాలో 18,000 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తుండగా  అందులో 12 వేల హెక్టార్లకే అనుమతులు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఆక్వా సాగు వల్ల వ్యవసాయం ప్రమాదంలో పడుతోందన్న ఆందోళన   ఇటీవలి కాలంలో అధికమైంది. నీటి కాలుష్యం, వ్యవసాయ భూములు దెబ్బతినడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

కాలుష్య ప్రభావంపై కోర్టుల్లో కేసులు సైతం నమోదయ్యాయి.నీలి విప్లవంలో భాగంగా ఈ రంగాన్ని గుర్తించిన ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి.ఆక్వా ద్వారా తలెత్తే కాలుష్యం, ఉప్పునీటి ప్రమాదం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో పలు చోట్ల ఆక్వా సాగుతో భూగర్భజలాలు ఉప్పుగా మారిపోయాయి. దీంతో ఆక్వా జోన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు.మత్స్య శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబరు నాలుగో తేదీన ఉత్తర్వు నంబరు 271 ద్వారా అపెక్స్‌ కమిటీ, టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసి జోన్ల విధానంపై స్పష్టత ఇచ్చారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తీర ప్రాంతం పరిధిలోని 13 మండలాల్లో 16 జోన్లను ఏర్పాటు చేస్తూ నివేదిక తయారు చేసింది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పాలసీ ఉండాలన్న వాదన తెరపైకి రావడంతో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఆక్వా సాగుకు సంబంధించి విధివిధానాలను నిర్ణయించారు. ఇకపై దీని ప్రకారమే ఆక్వా సాగుకు అనుమతులు ఇవ్వనున్నారు.

ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ కింద కొన్ని నిబంధనలు పాటించాలని నిర్దేశించుకున్నా ఆచరణలో అవి పలు  చోట్ల విఫలమయ్యాయి. సాగులోని వ్యవసాయ భూముల్లో అనధికారిక ఆక్వా సాగుకు బదలాయించకుండా ఆపడం, సుస్థిరమైన ఆక్వా అభివృద్ధికి దోహదపడడం, ఉప్పు నీటి ప్రభావం, తీర ప్రాంతం, లోతట్టు భూములు, వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఆక్వా సాగుకు అవకాశం కల్పించడం, బయో సెక్యూరిటీ, ఆన్‌లైన్‌  లైసెన్స్‌ సిస్టం వంటి వాటిని ఉల్లంఘించారు. జిల్లాలో వ్యవసాయ భూములు ఆక్వా, చేపల చెరువులుగా మారిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్య శాఖ 2015లో ఆక్వా జోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆక్వా సాగులో అనర్థాలను అధిగమించి సుస్థిరమైన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆక్వా జోన్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారమే ఇక నుంచి ఆక్వా సాగుకు అనుమతులు ఇవ్వనున్నారు.గ్రామాన్ని యూనిట్‌గా పరిగణించడం, ప్రతి గ్రామంలో ఆక్వాకల్చర్‌, వ్యవసాయేతర భూముల వివరాలపై అధ్యయనం చేయడం, వాటి సర్వే నంబర్లు, జియోట్యాగ్‌ చేయడం, ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ఆధారంగా మ్యాపింగ్‌ తయారు చేయడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి గ్రామంలో ఆక్వాకల్చర్‌ జోన్‌కు సంబంధించి మంచినీరు, ఉప్పునీటి సాగు ప్రాంతాలను స్పష్టంగా గుర్తించాలి.ఆక్వాకల్చర్‌ జోన్‌లో ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలు సాగు చేసుకునే రైతులు ఉంటే వారిని ఇబ్బంది పెట్టకుండా సాగుకు అవకాశం కల్పించడం, జోన్ల వివరాలను తెలిపేందుకు గ్రామసభలు నిర్వహించడం, ఇతర మార్గాల్లో ప్రజలకు తెలియజేయాలి. వ్యవసాయ భూములు, ఉప్పుసాగు చేసే భూములు, మడఅడవులు, మాగాణి, అటవీ భూములు, గ్రామ అవసరాలు, ప్రజాప్రయోజనం కోసం కేటాయించిన భూములు, జాతీయ పార్కులు, అభయారణ్యాల్లో ఆక్వా సాగుకు అనుమతులు ఇవ్వకుండా చూడాల్సి ఉంటుంది.

ఇప్పటికే మంచినీటి ఆక్వా సాగులో ఉన్న ప్రాంతాలను నిబంధనల మేరకు ఆక్వా జోన్లుగా  ప్రకటిస్తారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీ ఆక్వా జోన్లపై నిర్ణయం తీసుకున్న అనంతరం తదుపరి అనుమతి కోసం మత్స్య శాఖ కమిషనర్‌కు  ప్రతిపాదనలు పంపాలి.కమిషనర్‌ దీనిని పరిశీలించిన తరువాత వాటిని హైలెవల్‌ కమిటీకి సిఫార్సు చేస్తారు.వారు కూడా ప్రతిపాదనలను పరిశీలించాక ప్రభుత్వం ఆక్వా జోన్ల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.నిబంధనలకు అనుగుణంగా సొంత పూచీకత్తుతో ఆన్‌లైన్‌ ద్వారా ఆక్వా సాగుదారులు ప్రభుత్వానికి తమ దరఖాస్తులను పెట్టుకోవాల్సి ఉంటుంది.

Related Posts