ఒంగోలు, జూన్ 2,
ఏపీలో ప్రతిపక్ష టీడీపీని ఎంత చావు దెబ్బ కొట్టాలో అంత చావు దెబ్బ సీఎం జగన్ కొట్టేశారు. జగన్ వ్యూహాల్లో టీడీపీ తునాతునకలు అవుతోంది. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వాళ్ల సంగతి అలా ఉంటే ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలోనూ మనోధైర్యం సన్నగిల్లుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు జగన్ చెంత చేరిపోయారు. ఇక టీడీపీలో చంద్రబాబు, బాలయ్యను పక్కన పెడితే మిగిలిన 17 మంది ఎమ్మెల్యేల్లో గంటా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఇక పార్టీకి బలంగా ఉన్న నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లను కూడా ఏదోలా టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలు అయితే వైసీపీ నుంచి జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరందరిలోనూ గొట్టిపాటి రవికుమార్ చాలా స్ట్రాంగ్. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న రవి.. రేపటి ఎన్నికల్లో అవసరాన్ని బట్టి ప్రకాశం జిల్లా అంతటికి అయినా టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసే సత్తా ఉన్న వ్యక్తి.గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్, తర్వాత టీడీపీలోకి జంప్ చేసి.. గత ఎన్నికల్లో ఆ పార్టీలో విజయం సాధించారు. ఇప్పుడు జగన్ దృష్టంతా రవిమీదే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకిలో ఎలాగూ వైసీపీకి బలమైన క్యాండెట్ లేరు. ఇక గొట్టిపాటి రవికుమార్, వైసీపీకి ఎలాగూ అవసరం.. అంతే కాకుండా మనకు బలమైనా కాకపోయినా టీడీపీకి మాత్రం బలం కాకూడదు అన్న కోణంలోనే వైసీపీ ఆలోచన చేస్తోందట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటు అద్దంకి సీటు గెలవడంతో పాటు జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, టీడీపీకి బలం కాకుండా ఉంటే… వైసీపీ స్వీప్ చేస్తుందన్నదే జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పలు జిల్లాలు వైసీపీకి స్వీప్ అయితే… వైసీపీ కంచుకోట అయిన ప్రకాశం జిల్లాలో టీడీపీ ఏకంగా నాలుగు సీట్లు గెలిచింది. పశ్చిమ ప్రకాశంలో టీడీపీ అభ్యర్థులతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలో కొందరు టీడీపీ అభ్యర్థులకు గొట్టిపాటి రవికుమార్, ఆర్థికసాయం చేశారు.ఇంకా చెప్పాలంటే మంత్రి బాలినేనికి గొట్టిపాటి రవికుమార్, మధ్య వీరు ఏ పార్టీలో ఉన్నా కూడా సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రవి బాలినేనికి సాయం చేశారన్న గుసగుసలు కూడా జిల్లాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలో చేర్చుకునే విషయాన్ని జగన్ బాలినేనికే అప్పగించేశారట. గతంలోనే రవి గ్రానైట్ వ్యాపారాలపై దాడులు జరిగినప్పుడు ఆయన బాలినేని సిఫార్సులతోనే వాటికి కొద్ది రోజులు బ్రేక్ వేయించుకున్నారు. అయితే సిద్ధా రాఘవరావు పార్టీ మారిన సమయంలో రవి పార్టీ మారేందుకు ఒప్పుకోకపోవడంతో వరుసగా గొట్టిపాటి రవికుమార్,ని టార్గెట్ చేశారు. ఇప్పటికీ గొట్టిపాటి రవికుమార్ వ్యాపారాలు ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతోన్న పరిస్థితి.మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలతో టీడీపీ కేడర్ లో మరింతగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. కరోనా ఉధృతి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వరుసపెట్టి వైసీపీలోకి జంప్ కొట్టేసేవారన్న ప్రచారం జరిగింది. ఈ లిస్టులో గొట్టిపాటి రవికుమార్, పేరు కూడా వినిపించింది. ఇక బాలినేని మాత్రం రవి విషయంలో తన ప్రయత్నాలకు బ్రేక్ వేయకుండా కంటిన్యూ చేస్తున్నారట. రవి సైతం అటు టీడీపీలో ఉండలేక… ఇన్నిసార్లు గెలిచినా రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేక పార్టీ మారే విషయంలో డైలమాలోనే ఉన్నారని తెలుస్తోంది.