కడప
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని వివాదాస్పదంగా మారిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికలొ కొత్త పరిణామం చొటుచేసుకుంది. మఠం నూతన పీఠాధిపతి ఎంపిక కొసం చర్చించేందుకు 12 మంది పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారిమఠంకు చేరుకున్నారు. బ్రహ్మంగారి వారసుల మధ్య విభేధాలు పొడచూపిన నేపధ్యంలొ చర్చలు జరిపేందుకు పీఠాధిపతులు మఠం చేరుకున్నారు. శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ శివస్వామి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు పన్నెండు మంది పీఠాధిపతులు రావడం జరిగింది. మఠం చేరుకున్న శ్రీ శివస్వామి మాట్లాడుతూ... బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాద పరిష్కారం కోసం కృషి చేస్తామని, తమ రెండు రోజుల పర్యటనలొ భక్తుల మనోభావాలతో పాటు గత మతాధిపతుల శిష్యులు, స్థానికుల తో కూడా చర్చిస్తామని తెలియజేశారు. వివాదం కొర్టుకు చేరకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.