YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెద్దాపురంలో పట్టు రావడం లేదే

పెద్దాపురంలో పట్టు రావడం లేదే

రాజమండ్రి, జూన్ 3, 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. అనేది రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఐదేళ్లు ప్రతిప‌క్షంలో ఉండి.. ఇప్పుడే అధికారంలో ఉన్నాడు. మ‌ళ్లీ గెలిచేందుకు అనేక ప్రణాళిక‌ల‌తో ముందుకు వెళుతున్నాడు. ఇక వ‌చ్చే ఎన్నిక‌లే చంద్రబాబుకు చివ‌రి ఎన్నిక‌లు కావొచ్చు. ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే ప్రతిజిల్లా.. ప్రతి నియోజ‌క‌వ‌ర్గం.. కూడా ప్రతిష్టాత్మక‌మే. గ‌తంలో టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పాగా వేసింది. అయితే వీటిని మ‌రింత ప‌దిలం చేసుకునేందుకు జ‌గ‌న్ ఎన్నో వ్యూహాల‌తో ఉన్నారు. ఇక టీడీపీ గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మామూలు కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం లేదు. ఇలాంటి వాటిలో తూర్పుగోదావ‌రి జిల్లా ఒక‌టి. అయితే.. ఇక్కడి పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వైసీపీ విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. ఎన్నిక‌ల‌కు చివ‌రి నిముషంలో మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వైసీపీ న‌ష్టపోయింద‌నే టాక్ ఉంది. ఇక‌, టీడీపీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప.. 2014లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఇక్కడ విజ‌యం సాధించారు. టీడీపీకి ద‌శాబ్దాలుగా సేవ‌లు అందించిన ఆయ‌న తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఇక్కడే విజ‌యం సాధించారు. 2019లో పార్టీ రాష్ట్రంలో చిత్తుగా ఓడినా పెద్దాపురంలో హోరా హోరీ పోరులో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. 2014లో వ‌చ్చిన మెజారిటీ 10 వేల ఓట్లయితే.. గ‌త ఎన్ని కల్లో మాత్రం కేవ‌లం 4 వేల ఓట్లకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. వైసీపీకి ఇక్కడ అభ్యర్థి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో తోట వాణి గ‌ట్టిపోటీ ఇచ్చారు. చివ‌రి నిముషంలో టికెట్ క‌న్ఫర్మ్ అయిన‌ప్పటికీ.. ఆమె గ‌ట్టి పోటీ ఇచ్చారు. అయితే.. ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీకి అంటీముట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యస‌భ టికెట్ ఆశించినా.. జ‌గ‌న్ వైపు నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లి… అధిష్టానాన్ని బెదిరించార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ తోట ఫ్యామిలీని ప‌క్కన పెట్టేశారు. దీంతో జ‌గ‌న్ తోట ఫ్యామిలీని సైడ్ చేసేసి… ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు అక్కడ పార్టీ బాధ్య‌త‌లు చూసినా ఎన్నారై ద‌వులూరి దొర‌బాబుకే ఇన్‌చార్జ్ బాధ్యత‌లు క‌ట్టబెట్టారు. అయితే ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ దొర‌బాబుకే సీటు వ‌స్తుందా ? అన్న సందేహం వైసీపీ వాళ్లకే ఉంది.ఇటు రాజ‌ప్పకు సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేక‌త ఉంది. ఎన్నిక‌ల‌కు ముందే ఓ వ‌ర్గం బొడ్డు భాస్కర‌రావుకు సీటు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచి.. ఇక్కడ రాజ‌ప్ప గెలిచినా కూడా ఈ వార్ కొన‌సాగుతూనే ఉంది. ఇక తాజాగా భాస్కర‌రావు మృతి చెంద‌డంతో టీడీపీలో గ్రూపుల గోల‌కు శుభం కార్డు ప‌డుతుందా ? లేదా ? అన్నదానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఏదేమైనా అటు వైసీపీ బ‌ల‌హీన‌త‌ల‌ను ఇక్కడ టీడీపీ క్యాష్ చేసుకోలేక‌పోతోంది. టీడీపీలో ఉన్న వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుని బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని వైసీపీ కూడా డ‌ెవ‌ల‌ప్ చేసుకోలేక‌పోతోంది. ఇది పెద్దాపురంలో రెండు పార్టీల పాట్లు ?

Related Posts