విజయవాడ, జూన్ 3,
విజయవాడ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం పాత్ర ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. విజయవాడ మేయర్‌గా జంధ్యాల శంకర్.. రాజకీయంగా కాంగ్రెస్‌ను రెండు దశాబ్దాలపాటు అధికారంలో ఉంచారు. తర్వాత.. చెన్నుపాటి విద్య (బ్రాహ్మణ సామాజిక వర్గం).. వంటి వారు రాజకీయంగా విజయవాడలో రికార్డు సృష్టించారు. అయితే.. ఇదంతా కూడా 1980-90ల మధ్య కాలంలోనే. అయితే.. తర్వాత కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గం దూరమై.. కమ్మ సామాజిక వర్గం రాజకీయాల్లోకి ప్రముఖంగా వచ్చింది. అదే సమయంలో బీసీ సామాజిక వర్గం కూడా పుంజుకుంది. ఇక కాపుల ప్రాధినిత్యం కూడా రంగా హయాం నుంచి ఎక్కువుగానే ఉంటోంది.ఈ క్రమంలో 2004వ సంవత్సరంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం.. తర్వాత 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయం సాదించారు. అప్పట్లో ప్రస్తుత సీఎం జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయుడైన నేతగా విజయవాడలో మల్లాది విష్ణు పేరు తెచ్చుకున్నారు. ఐలాపురం వెంకయ్య (బీసీ నేత) తర్వాత.. ఆ ప్లేస్‌లో మల్లాది విష్ణు గుర్తింపు తెచ్చుకున్నారని.. కాంగ్రెస్‌లో అప్పట్లో చర్చసాగేది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిష్టాత్మకమైన వుడా చైర్మన్‌గా మల్లాది విష్ణు పనిచేశారు.ఈ క్రమంలోనే 2009లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రజారాజ్యంలోకి వెళ్లిపోవడంతో మల్లాది విష్ణుకి ఊహించని విధంగా వైఎస్ సెంట్రల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో ఆయన హోరాహోరీ పోరులో రాధానే ఓడించారు. ఈ ఎన్నికల్లో మల్లాది విష్ణు గెలిచిన తర్వాత.. వైఎస్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించారు. నేరుగా పది రోజులు నిత్యం వైఎస్‌ను కలిసి తన అభ్యర్థనను కూడా వివరించారు. అయితే.. అప్పటి సమీకరణల నేపథ్యంలో ఇదే సామాజిక వర్గంలోని శ్రీధర్ బాబుకు అవకాశం ఇచ్చిన వైఎస్ తర్వాత చూద్దామని మాత్రం హామీ ఇచ్చారు.అయితే.. వైఎస్ అకాల మరణంతో మల్లాది విష్ణు కోరిక నెరవేరలేదు. ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయ్యాక విప్ పదవిని ఇదే సామాజిక వర్గానికి చెందిన దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఇచ్చారు. అలా మల్లాది విష్ణు కోరిక అప్పట్లో నెరవేరలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు.. వైఎస్ తనయుడు జగన్ నేతృత్వంలోని వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు మనసు మాత్రం మంత్రి పీఠంపైనే ఉంది. తనకు ఉన్న పరిచయాలతో సీఎం జగన్‌కు తన మనసులోని కోరికను వెల్లడించారని.. `అప్పట్లో నాన్నగారు ఇస్తానన్న` విషయాన్ని కూడా జగన్‌కు చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరో ఆరు మాసాల్లో మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో మరి అప్పట్లో వైఎస్ వాయిదా వేసిన మల్లాది విష్ణు కోరికను జగన్ తీరుస్తారో లేదో చూడాలి.