న్యూఢిల్లీ, జూన్ 3,
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయ భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేక మరో దారి చూసుకుంటారా? అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది. ఆయనకు మరోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పదవిని రెన్యువల్ చేస్తుందని భావించారు. అయితే అటువంటి సంకేతాలు ఏమీ కన్పించకపోవడంతో గులాం నబీ ఆజాద్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారంటున్నారు.గులాం నబీ ఆజాద్ కు కాంగ్రెస్ తో నలబై ఏళ్ల అనుభవముంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఏన్నో ఉన్నత పదవులను పొందారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ ఎంత నమ్మకంగా ఉన్నారో, అదే సమయంలో పార్టీ కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే రెండోసారి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిన తర్వాత గులాం నబీ ఆజాద్ అసంతృప్తిలో ఉన్నారు.ఇప్పటికీ గులాం నబీ ఆజాద్ సోనియాగాంధీకి వీర విధేయుడే. కాకుంటే రాహుల్ తోనే కొన్ని సమస్యలున్నాయి. సీనియర్లు సలహాలు తీసుకోరని, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని, ఓటమి పాలయినంత మాత్రాన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఎందుకన్నది గులాం నబీ ఆజాద్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ పూర్తిగా దూరం పెట్టింది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా గులాం నబీ ఆజాద్ స్వరం కూడా పెంచారు.ఆయన 22 మంది కాంగ్రెస్ నేతలతో కలిసి పార్టీ అధినేతకు లేఖ రాయడం కూడా వివాదాస్పదమయింది. దీంతో గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవికి మళ్లీ కాంగ్రెస్ ఎంపిక చేస్తుందా? లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గులాం నబీ ఆజాద్ ను వదులుకునేందుకు సోనియా గాంధీకి ఇష్టం లేకపోయినా రాహుల్ గాంధీ మాత్రం సీనియర్ల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేదా? అన్నది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుందని చెబుతున్నారు.