తిరువనంతపురం జూన్ 3
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్యంగా వచ్చినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర చెప్పారు. రుతపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు ఆయన తెలిపారు.గాలి వేగం, వర్షపాత స్థిరత్వం, తీవ్రత, మేఘాలు ఆవరించడాన్ని బట్టి రుతపవనాల రాకను వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. గత రెండేళ్లుగా సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసినట్లు ఐఎండీ చెప్పింది. 2020లో 110 శాతం 2019లో 109 శాతం వర్షపాతం నమోదైంది.