న్యూఢిల్లీ జూన్ 3
ఇండియన్ వ్యాక్సిన్ అయితే ఏంటి.. విదేశీ అయితే ఏంటి.. అందరికీ ఒకే రకమైన రక్షణ కల్పించాల్సిందే అని అదర్ పూనావాలాకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఫైజర్, మోడెర్నాలాగే తమకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలని కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం డిమాండ్ చేస్తోంది. అసలు సీరం ఒక్కటే కాదు.. ఒకవేళ విదేశీ కంపెనీలకు ఆ చట్టపరమైన రక్షణ కల్పిస్తే.. మిగత అన్ని వ్యాక్సిన్ కంపెనీల కూడా కల్పించాలని సీరం వర్గాలు గురువారం డిమాండ్ చేశాయి.రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలన్నది ఆ సంస్థ వాదన. ప్రస్తుతం ఇండియాలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్న సీరం.. మరో మూడు కొత్త వ్యాక్సిన్ల ట్రయల్స్‌లోనూ పాలుపంచుకుంటోంది. అయితే తమ వ్యాక్సిన్ల వల్ల ఎవరికైనా ఏవైనా దుష్ప్రభావాలు కలిగినా తమపై చట్టపరమైన దావాలు వేయకుండా ఉండే రక్షణలు కల్పించాలని ఫైజర్, మోడెర్నాలాంటి విదేశీ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి కేంద్రం అనుకూలంగా ఉన్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి.అమెరికాలాంటి దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ సంస్థలకు ఈ లీగల్ ప్రొటెక్షన్‌ను అందించాయి. అంటే ఆ దేశాల్లో వ్యాక్సిన్ల వల్ల ఎవరికి ఏం జరిగినా.. నష్ట పరిహారం కోసం ఆ కంపెనీలను డిమాండ్ చేసే అవకాశం ఉండదు. అలాంటి రక్షణలే తమకూ కావాలని సీరం సంస్థ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తోంది.