న్యూఢిల్లీ, జూన్ 4,
కరోనాపై పోరులో విజయం సాధించడానికి ప్రపంచం ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. అందుకే అన్ని దేశాలూ ఈ వ్యాక్సిన్లపైనే దృష్టి సారించాయి. భారత ప్రభుత్వం కూడా ఈ ఏడాది చివరిలోపే దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా గురువారమే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదొక్కటే కాదు.. త్వరలోనే మరిన్ని ఇండియన్ మేడ్ వ్యాక్సిన్లు మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
జైడస్ కాడిలా.. 5 కోట్ల డోసులు
అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా నుంచి జైకొవ్-డీ అనే కొవిడ్ వ్యాక్సిన్ వస్తోంది. ఈ ఏడాది చివరిలోపు 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాదు 5 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై కూడా ఈ సంస్థ తన వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు చెప్పింది.
జెన్నోవా.. 6 కోట్ల డోసులు
పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ కంపెనీ కూడా హెచ్‌జీసీ019 పేరుతో కొవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తోంది. ఈ సంస్థ 6 కోట్ల డోసులు ఇవ్వనుంది. ఇండియాలో తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌పై ఈ సంస్థ పని చేస్తోంది. ప్రస్తుతం తొలి దశ ట్రయల్స్‌లో ఉంది. రెండు నెలల్లో ఇది పూర్తి కానుంది. ఆ తర్వాత రెండో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయి.
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్
ఇక ఇప్పటికే కొవాగ్జిన్ టీకా తయారు చేస్తున్న హైదరాబాద్‌కే చెందిన భారత్ బయోటెక్ నుంచి ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కూడా వస్తోంది. డిసెంబర్‌లోగా ఇలాంటి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు రానున్నట్లు గత నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. ఇది కూడా ప్రస్తుతం తొలి దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ వ్యాక్సిన్ పేరు బీబీవీ154.
నొవావ్యాక్స్.. 20 కోట్ల డోసులు
అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ కంపెనీ టీకాను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయనుంది. ఈ మధ్యే అమెరికా ముడిసరుకులపై నిషేధం ఎత్తేయడంతో ఈ వ్యాక్సిన్ తయారీకి లైన్ క్లియరైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ వ్యాక్సిన్ ప్రపంచ మార్కెట్‌లోకి రానుంది. డిసెంబర్‌లోగా సీరం 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వనుంది.
వీటికి తోడు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులు కూడా భారీగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్‌లోగా 75 కోట్ల కొవిషీల్డ్, 55 కోట్ల కొవాగ్జిన్ డోసులు రానున్నట్లు అంచనా వేసింది. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు 15.6 కోట్ల డోసుల మేర అందుబాటులోకి రానున్నాయి.
ఫైజర్, మోడర్నా సంప్రదింపులు
భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి గురువారం పేర్కొన్నారు. భారత్ లో సత్వరమే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల సరఫరాలు చేపట్టేలా తాము సహకరించామని చెప్పారు.మహమ్మారి విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్ సేకరణ కసరత్తులో భారత్ భాగస్వామ్యం అవుతోందని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వీ ష్రింగ్లా పేర్కొన్నారు. జీ7, జీ20, క్వాడ్, బ్రిక్స్, ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్ఓలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇక వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్ కంపెనీలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు హోంమంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది.