తిరుపతి, జూన్ 4,
జగన్ ఎక్కువగా మాట్లాడరు, అది బయట సభలలోనే కాదు, లోపల పార్టీ నేతలతో కూడా ఆయన స్టైల్ అలాగే ఉంటుంది. తక్కువగా మాట్లాడుతూ నేతల తీరును ఆయన జాగ్రత్తగా అంతా గమనిస్తారు. ఆ మాటల నుంచే ఎవరికి తోచిన అర్ధాలు వారు తీసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితం పట్ల జగన్ ఏమంత సంతృప్తిగా లేరు అన్నది ప్రచారం అవుతోంది. తాను కోరుకున్న అయిదు లక్షల మెజారిటీని నేతలు సాధించలేకపోయారు అన్న బాధ అయితే ఆయనలో ఉంది. అదే సమయంలో పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదని, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదని కూడా నివేదికలు జగన్ కి అందాయట.ఇక తిరుపతి కొత్త ఎంపీ గురుమూర్తి జగన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనతో పాటు ఆ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు కూడా జగన్ని కలిసిన సందర్భంగా జగన్ చేసినట్లుగా చెప్పబడుతున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి బాగా పనిచేశారని, అలాగే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి చక్కగా పనిచేశారని జగన్ కితాబు ఇవ్వడంతో సీనియర్లు ఖంగు తిన్నారని టాక్. వారసులే బెటర్ అని జగన్ అన్నట్లుగా ప్రచారం సాగుతోంది.దీన్ని బట్టి చూస్తూంటే జగన్ సీనియర్లను పక్కన పెట్టి యూత్ కే తాను చాన్స్ ఇస్తానని చెప్పకనే చెబుతున్నాట్లుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధిగా అభినయ్ రెడ్డి ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇక శ్రీకాళహస్తికి బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆయనను పక్కన పెట్టినా ఆ ఇంట్లో నుంచే కుమార్తెను ముందుకు తెస్తారు అన్న టాక్ కూడా ఉంది. ఇదే వరసలో చాలా చోట్ల పదవులలో యువతకే అవకాశాలు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా నేతలు కనిపెట్టేశారుట. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో కూడా గురుమూర్తి కొత్త ఫేస్. యువకుడు అని గుర్తు చేస్తున్నారు.పెద్దవాళ్ళు అంటే సలహాలకు మాత్రమే అన్నది జగన్ భావనగా ఉందని అంటున్నారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా కూడా జగన్ యువతకే పెద్ద పీట వేసి మంత్రులను చేశారు. ఇక రానున్న కాలంలో కూడా ఇదే సీన్ ఉంటుందని ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా యువతకే ఎక్కువగా ఇస్తారని జగన్ మాటల బట్టి అర్ధమవుతోంది. దీంతో సీనియర్లకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని జగన్ తన వ్యాఖ్యల ద్వారా క్లారిఫై చేశారు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం అంతా పనిచేయాలని కూడా జగన్ గట్టిగా ఆదేశించారట. వారికే గుర్తింపు గౌరవం అని జగన్ చెప్పడం ద్వారా సీనియర్లకు స్వీట్ వార్నింగే ఇచ్చేశారు అంటున్నారు.