చెన్నై, జూన్ 4,
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం. కరుణానిధి జయంతి వేళ సీఎం ఎంకే స్టాలిన్ ఐదు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. రేషన్ దుకాణాల్లో 14 రకాల సరుకుల పంపిణీ పథకం, కరోనా సాయం కింద రెండో విడత ఆర్థిక సాయం, పూజారులకు రూ.4 వేలు గౌరవ వేతనం, మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల అర్థిక సాయం, జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేసే పథకాలను ప్రారంభించారు.సెక్రటేరియట్ ప్రాంగణంలోని సెయింట్ జార్జ్ కోట వద్ద గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగిన కరుణానిధి జయంతి వేడుకల్లో ఈ ఐదు పథకాలను స్టాలిన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ నియంత్రణకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అనేక మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని రేషన్‌కార్డుదారులకు 14 రకాల నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు.డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కరోనా సాయం రెండో విడత కింద రూ.2 వేల నగదు పంపిణీని ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా 10 మందికి నగదు, నిత్యావసర సరకుల కిట్‌ను అందజేశారు. ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే కరోనా సాయం కింద తొలి విడత రూ.2,000 నగదు పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద 2.09 కోట్ల మందికి లబ్ది కలగనుంది. మొత్తం 8.392.76 కోట్లు ఇందుకు ఖర్చుచేయనున్నారు.ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తూ నెలసరి వేతనం పొందని అర్చకులకు రూ.4 వేల ఆర్థిక సాయం, 10 కిలోల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ పథకం కూడా లాంఛనంగా ప్రారంభమయ్యింది. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, న్యాయమూర్తులు, లాయర్లు, పోలీసులు తదితరులకు రూ.25 లక్షలు, విలేకరులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులను మాత్రం ఐదో తేదీ నుంచి లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ సరుకులతో పాటు రూ.2 వేల కరోనా ఆర్థిక సాయం కూడా అప్పుడే ఇవ్వనున్నారు. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, తోపులాటలు లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.నిత్యావసరాల కిట్‌లో ఒక్కో కిలో గోధుమ పిండి, ఉప్పు, గోధుమ రవ్వ.. పంచదార, కంది పప్పు అరకిలో.. పావుకిలో చింతపండు, శెనగపప్పు, 200 గ్రాముల టీపొడి, 100 గ్రాముల చొప్పున ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, స్నానం చేసుకునే సబ్బు, బట్టలు సబ్బు ఒక్కొక్కటి నిత్యావసర కిట్‌లో ఉంటాయి.