దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సంప్రదింపులు కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెన్నైలో పర్యటిస్తున్నారు. సోమవారం కేసీఆర్ పలువురు తమిళ నేతలతో చర్చించారు. డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళి కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక ఐటీసీ చోళ హోటల్‌లో కేసీఆర్‌తో సమావేశమైన ఆమె ఫెడరల్ ప్రంట్, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సుమారు గంట పాటు చర్చించారు.ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుందని కనిమొళితో కేసీఆర్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారుతెలంగాణ పథకాలను కనిమొళికి కేసీఆర్ వివరించారు. ఆమె త్వరలో హైదరాబాద్‌కు వచ్చి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలిస్తానని తనతో చెప్పినట్టు కీసీఆర్.. మీడియాకు వెల్లడించారు. కేసీఆర్‌తో పాటు ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ అయిన కేసీఆర్.. తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు.