YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*దేవతా సాక్షాత్కారం...*

*దేవతా సాక్షాత్కారం...*

సుందరాకాండలో హనుమ సీతాన్వేషణకు బయలు దేరేటప్పుడు అప్పటికి ప్రధానంగా ఉన్న దేవతల కందరికీ నమస్కరిస్తాడు. మొదటి సర్గ 8 వ శ్లోకం.
లంకలో అంగుళం అంగుళం మొత్తం వేతుకుతాడు. సీత కనబడక చాలా నిరాశపడతాడు. రావణుడు సీతను ఎత్తుకు పోయేటప్పుడు ఋష్య మూకం మీదుగా నే దక్షిణం వైపు తీసుకెళ్లాడు. వాడి రాజ్యం లంక అని అందరికి తెలుసు. సీత జారవిడిచిన ఆభరణాలు రాముడికి లక్ష్మణుడికి చూపిస్తారు కూడా. సంపాతి చెప్పిన దానినిబట్టి కూడా ఆమె లంకలోనే ఉండాలి. కానీ హనుమకు ఎంత వెతికినా కనపడదు. హనుమ చాలా నిరాశ పడతాడు. ఆయనకు బుద్ధి మతాం వరః ఆనిపేరు. ఆ బుద్ధాంతా వినియోగిస్తే ఆయనకే విషయం బోధ పడుతుంది. అప్పుడు మళ్ళీ దైవ ప్రార్ధన చేస్తాడు. ఈసారి రాముడి నీ లక్ష్మణుడినీ, సీతనూ దైవ ప్రార్ధన లో కలుపుతాడు. 13 వ సర్గ 59 శ్లోకం (నమోస్తు రామాయ సలక్ష్మనాయ) నుంచి 67 వ శ్లోకం వరకు. నమోస్తు రామాయ శ్లోకం లో రెండో పాదం లో దేవ్యై .... జనకాత్మజాయై అని ఉంది. సంస్కృత వ్యాకరణ పరిచయ ముంటే ఆ పదాలు రెండూ చతుర్థి విభక్తి లో వున్నాయని తెలుస్తుంది. శ్రీరాముడి దేవి అనే అర్థం రానే రాదు. దేవి యైన జనకాత్మజకు అనే అర్థం మాత్రమే వస్తుంది. నవవ్యాకరణ వేత్త అయిన హనుమ సరిగ్గా వాడిన పదమది. ఇంకో అర్థమే లేదు. దేవి అనే మాట ద్వారా పుజ్యభావం ప్రకట మౌతుంది.  సీతను పరాశక్తి గా భావించి  13 వ సర్గ లో  "తదున్న సం పాండుర దంత మవ్రణం"  అని 68 వ శ్లోకం లో ధ్యానిస్తాడు. ఈ శ్లోకం లో ధ్యానించే రూపం రాముడు కాని లక్ష్మణుడు కానీ వర్ణించిన సీత రూపం కాదు. ఆర్యా అనే సంబోధన కూడా సీతది కాదు. అమ్మవారిది. ఆంజనేయుడి కి మనసులో సీత దేవత, పరాశక్తి అన్నభావము గాఢంగా పాదుకున్న తరవాత అప్పుడావిడ కనిపిస్తుంది. ఇది సాక్షాత్కారం. 
సాక్షాత్కారం చేసుకునే దేవత మీద దేవతా భావము భక్తి ఉండాలి. ఆర్తి, ఏకాగ్రతల తో కూడిన ధ్యానం  వుంటే నే దేవత సాక్షాత్కారం జరుగుతుంది.
*జపం ఇన్ని లక్షలు పూర్తి చేశామా? 40 రోజులు దీక్ష చేశామా? ఉపవాసం  ఉన్నామా? వంటి పిచ్చి లెక్కలు సాక్షాత్కారం దగ్గర పని చేయవు. దర్శనం కావలిసిన దేవతను ఆర్తితో ధ్యానించాలి. మిగతా అన్నీ వున్నా కూడా, దేవతా సాక్షాత్కారం దేవత కరుణిస్తే జరగాలి గాని భక్తుడి  మొండితనం మీద మాత్రమే ఆధారపడదు...*
*ఏకాగ్రతతో కూడిన ధ్యానం అమ్మవారి కటాక్షము ఈ రెండూ లేకుండా సాక్షాత్కారం జరగదు.* 
*సీత వెతికితే కనబడలేదు. ప్రార్ధిస్తే కనపడింది.*.. రెండిటికీ తేడా ఉంది. అది తెలుకోవాలి. వాల్మీకి రామాయణం లో ఈవిషయం స్పష్టంగా వ్రాశాడు. ఆయన ఇంతవరకు మాత్రమే వ్రాసి వదిలి పెట్ట లేదు.
*భక్తి లేకుండా కేవలం శక్తి మీద ఓపికమీద ఆధారపడి  వెతకడం  చేస్తే సీత కనపడదు మండోదరి కనిపిస్తుంది అని కూడా వాల్మీకి మహర్షి స్పష్టం చేసి పెట్టారు...*
ఇదంతా చెప్పిన తరవాత ఒక జాగ్రత్త పడాల్సిన విషయం చెప్పాలి.
*నిత్య పూజా, నియమ బద్ధమైన నడవడికా, ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా అవసరము. అది మొదటి మెట్టు. ఆ మెట్టు దాటకుండా ఎవరూ పైకి పోలేరు. పైకి పోవడ మనేది చాలా జన్మ ల లో జరగాల్సిన విషయం.  ప్రహ్లాదుడు ధ్రువుడు కర్మ మార్గం లో ప్రయాణించ లేదు కదా వాళ్ళ సంగతేమిటి అంటారేమో! వాళ్ళు ఆ జన్మలు దాటి వచ్చిన వాళ్ళు. వాళ్ల తో మనకు పోలిక వద్దు.*
ఏకాగ్రతతో కూడిన ధ్యానం అన్నారు కదా అని చేసే పూజలూ నియమాలు పక్కనబెట్టి ఆ కొస మెట్టు కు సూటిగా ఎగిరి పోదామంటే కుదరదు. నేను చాలా వేదాంత గ్రంధాలు చదివాను. జ్ఞానం ఉంది. నాకు నియమాలు పూజలూ అక్కరలేదు. కర్మలు చెయ్యను. అంటే వీలు పడదు. భక్తి మార్గం  జ్ఞాన మార్గం ఏదో ఒకటే పట్టుకు కూర్చుంటాను అంటే వీలుకాదు.  ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది.  జీవితం లో నిత్య పూజా, నియమ బద్ధమైన నడవడికా తప్పకుండా ఉండాలి. వాటితో పాటు ఉపాస్య దేవత మీద భక్తి, శ్రద్ధ, దాస  భావం కూడా ఉండాలి. సత్కర్మలు చెయ్యాలి. భగవ దర్పితంగా కర్మలు చెయ్యాలి. ఇది బాగా అలవాటయితే నిష్కామకర్మ దగ్గర కు రావచ్చు.
*కర్మలు చెయ్యకుండా జ్ఞానాన్ని భక్తిని అందులో ఏదో ఒక దానిని, పట్టుకుని పైకి వెళదామను కుంటే అది సాధ్యం కాదు...*
లంకకు వెళ్ళకుండా అసలు  ప్రయత్నమే చేయకుండా ఏమీ వెతక కుండా,  ఆంజనేయుడైనా సముద్రం ఇవతలి గట్టు  దగ్గర కూర్చుని  "తదున్న సం పాండుర దంత మవ్రణం" అంటే సీత కనబడదు కదా.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts