YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దీక్షల జోరు

దీక్షల జోరు

 

ఆంధ్రప్రదేశ్... ప్రభుత్వ-ప్రతిపక్షాలు దీక్షల జోరు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రప్రభుత్వంపై టీడీపీ పోరు చేస్తుండగా.. విపక్షం వైసీపీ.. ముఖ్యమంత్రి వంచిస్తున్నారంటూ దీక్షకు దిగింది. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైసీపీ ‘వంచన వ్యతిరేక’ దీక్ష చేపట్టింది. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమీపంలో మహిళా జూనియర్‌ కళాశాల వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు దీక్షలో పాల్గొన్నారు. హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నల్లదుస్తుల్లో నిరసన దీక్షలో పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర కొద్దిరోజుల్లో విశాఖ జిల్లాకు చేరనుంది. దీంతో స్థానికంగాపార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పోరాటాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు ఈ దీక్షను వేదికగా మలచుకుంది. రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా తెదేపా చేసిన వంచన, పార్లమెంట్లో హోదా కోసం తాము పోరాడిన తీరును నేతలు ఈ దీక్ష సందర్భంగా ప్రజలకు వివరించారు. 

 

ప్రత్యేక హోదాపై మొదటినుంచి పోరాడుతున్నది తామేనని వైసీపీ నాయకగణం వివరించింది. తమ పార్టీ అధినేత జగన్ వల్లే ఇంకా ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని పేర్కొంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌ కే ఉందని వైసీపీ నేతలు స్పష్టంచేశారు. 25 పార్లమెంట్‌ సభ్యులను ఇస్తే హోదా తెస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిప్డడారు. హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంతోపాటు రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ‘ధర్మ పోరాటం’ అంటూ తిరుపతిలో దీక్షకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి తామంతా ముందుంటామని, కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం తుదికంటా పోరాడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.   

Related Posts