వరంగల్, జూన్ 5,
పుస్తకాలు చూస్తూ చదివితేనే స్టూడెంట్లకు పాఠాలు అర్థమవుతాయి. ఆన్లైన్ పాఠాలు కావడంతో స్టేట్లో టెక్ట్స్ బుక్స్ను స్టూడెంట్లు పెద్దగా కొనలేదు. దీంతో ఆన్లైన్ పాఠాలు విన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది కూడా ఇలానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఎడ్యుకేషన్ క్వాలిటీపై ఎఫెక్ట్ పడుతుందని ఇటు విద్యావేత్తలు, అటు ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలో 10,763 ప్రైవేటు స్కూళ్లుండగా, వాటిలో 32.37 లక్షల మంది చదువుతున్నారు. ఆయా స్కూళ్లలో చదువుతున్న ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న స్టూడెంట్లందరికీ ఏటా 1.28 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పుస్తకాల ప్రింటింగ్ కోసం విద్యాశాఖ అధికారులు టెండర్లు పిలిచి, ప్రింటింగ్ కోసం పబ్లిషర్స్కు ఆర్డర్స్ ఇచ్చారు. ముందుగా 35 లక్షల పుస్తకాలను పబ్లిషర్స్ ప్రింట్ చేశారు. గతేడాది కరోనా తీవ్రత నేపథ్యంలో దాదాపు ఆన్లైన్ పాఠాలు కొనసాగాయి. స్టూడెంట్లు పుస్తకాలను పెద్దగా కొనుగోలు చేయలేదు. కేవలం 17 లక్షల వరకే బుక్కులను అమ్మారు. దీంతో పబ్లిషర్స్ నష్టపోయారుసర్కారు స్కూళ్లలో చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు అందిస్తుండగా.. ప్రైవేటులో మాత్రం విద్యాశాఖ ఎంపిక చేసిన బుక్ షాపుల్లో సర్కారు నిర్ణయించిన ధరలకు స్టూడెంట్లు కొనుక్కోవాలి. స్టేట్ లో పలు కార్పొరేట్ స్కూళ్లు, రూల్స్ కు విరుద్ధంగా సొంతంగా అవే పుస్తకాలు ప్రింట్ చేసుకుంటున్నాయి. ఇవే సుమారు 50 లక్షల బుక్స్ దాకా ఉంటాయి. అయితే చాలామంది స్టూడెంట్లు పుస్తకాలు కొనలేదని స్పష్టమవుతోంది. దీంతో స్టూడెంట్లు ఆన్లైన్ పాఠాలు సరిగా విన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది లాక్డౌన్ కారణంగా చాలామంది పేరెంట్స్ ఉద్యోగాలు పోయాయి. దీంతోనే పుస్తకాలు కొనుగోలు చేయక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అసలు పుస్తకాలు కొన్న పిల్లలు కూడా వాటిని చదివారా లేదా అనేది అనుమానమే. ఫిజికల్ క్లాసుల సమయంలో స్టూడెంట్ల వద్ద పుస్తకాలు ఉన్నా, వారిలో సగం మందికి పాఠాలు సరిగా అర్థంకావు. అలాంటిది అవి లేకుండా ఆన్లైన్లో చదువులు ఏ మేరకు వారికి అర్థమైందనే దానిపై అయోమయం నెలకొన్నది. సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లపై టీచర్లు, అధికారులు కొంత మానిటరింగ్ చేశారు. కానీ ప్రైవేటు బడుల్లో చదివే వారిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదనీ, దీంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని స్టూడెంట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. దీని ప్రభావం క్వాలిటీపై తీవ్రంగా పడుతుందని విద్యావేత్తలు చెప్తున్నారు. మరోపక్క ఈయేడు కూడా ఆన్లైన్ పాఠాలే కావడంతో, ఇదే ధోరణి కొనసాగే పరిస్థితులున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని, బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లలో చదివే స్టూడెంట్లందరికీ ఈయేడు ఉచితంగా పుస్తకాలు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు.