మహబూబ్ నగర్, జూన్ 5,
ప్రభుత్వ ఉత్తర్వుల్లో రెండు రకాల మార్కెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలు అటకెక్కాయి. ప్రస్తుతం గ్రామాల్లో వారాంతపు సంతల నిర్వహణలో అమ్మకందారులు, కొనుగోలుదారులు లెక్కలేనన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోడ్లపైనే అమ్మకాలు నిర్వహిస్తారు. ధన్వాడలో తహశీల్దారు కార్యాలయానికి వెళ్లే రహదారిపైనే వారాంతపు సంత నిర్వహిస్తారు. ప్రతి గురువారం జరిగే ఈ సంత సందర్భంగా రెవెన్యూ కార్యాలయానికి మధ్యాహ్నం నుంచి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతాయి. దీనికి తోడు ఎండలోనే అమ్మకాలు ఉంటాయి. తాగునీటి వసతి ఉండటం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అసలే కనిపించవు. పథకం అమల్లోకి వస్తే సమస్యలన్నీ లేకుండా పోతాయి. మొదటి రకం 30 దుకాణాల సముదాయం, దీని అంచనా వ్యయం రూ. 15 లక్షలు ఉంటుంది. ఇందులో రూ. పది లక్షల నిధులను ఉపాధి హామీ చెల్లిస్తుంది. మిగిలిన రూ. 5 లక్షలను పంచాయతీ చెల్లించాలి. ఉపాధి నిధులతో 30 దుకాణాలకు సంబంధించి ఓపెన్ రైజ్డ్ ప్లాట్ ఫారం నిర్మిస్తుంది. అలాగే స్త్రీలు, పురుషులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, వర్షపు నీటి తరలింపునకు కాల్వలు, చెత్త కుండీ, వాహనాల నిలుపుదలకు స్థలం ఏర్పాటు చేస్తారు. ఇక పంచాయతీ వాటా ధనమైన రూ. 5 లక్షలతో కార్యాలయ గది, సరకుల నిల్వ గది, 30 దుకాణాలకు సంబంధించిన పైకప్పు షీటు, పైపుల ఏర్పాటుకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక రెండో రకానికి చెందిన మార్కెట్ 20 దుకాణాల సముదాయంతో కూడినది. దీని అంచనా వ్యయం రూ. 12.25 లక్షలు కాగా ఇందులో ఉపాధి హామీ పథకం రూ. 9 లక్షలు భరిస్తుండగా మిగతా రూ. 3.25 లక్షలను పంచాయతీ భరించాలి. ఇందులో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధి పథకం గురించి స్థానిక పాలకులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఈ పథకం ఉన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. స్థానిక పాలకులకు అవగాహన కల్పించాలని కమిషనర్ ఉపాధి అధికారులను ఉత్తర్వుల్లో కోరారు. కాని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. పథకం గురించి వివరించడమే కాకుండా ఆసక్తి కలిగిన పంచాయతీల నుంచి అవసరమగు స్థలాన్ని సేకరించి నివేదించాల్సిందిగా కోరారు. అలాగే వారి వాటా ధనం విషయాన్ని విపులంగా వివరించాలని వీటి ఏర్పాటుతో కలిగే లాభాలను తెలియజేయాలని కోరారు. కాని ఇతర పనుల్లో పడ్డ ఉపాధి అధికారులు ఈ ఆదేశాలను ఎక్కడా పాటించడం లేదు. ఉపాధి పథకాన్ని అమలు చేస్తే గ్రామాల్లో అమ్మకం, కొనుగోలుదారులకు పలురకాలుగా ప్రయోజనం చేకూరుతుంది.