తెలుగు రాష్ట్రాల్లో భానుడు విజృంభిస్తున్నాడు. ప్రతీ ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. కొన్నిచోట్ల రికార్డ్ లెవల్ టెంపరేచర్లు నమోదవుతుండడంతో పాటూ వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఫలితంగా అత్యవసర పనులుంటేనే గానీ ఎవ్వరూ కాలు బయటపెట్టడంలేదు. ఉదయం 7 గంటలకే ఎండ వచ్చేస్తోంది. ఇక 8 గంటల నుంచి ఉష్ణోగ్రతో పాటూ ఉక్కపోతా పెరిగిపోతోంది. 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపించేస్తున్నాడు. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. చెమటకు తడిసి ముద్దైపోతున్నవారు చాలామందే ఉంటున్నారు. ఇక మధ్యాహ్నం అయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఈ రేంజ్ లో పెరిగిపోవడంతో సర్వత్రా భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. పెరిగిపోతున్న టెంపరేచర్లు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయొచ్చన్న భయం అందరినీ వెన్నాడుతోంది. దీంతో వైద్య నిపుణులు ప్రజలకు అనేక సూచనలు చేస్తున్నారు.
అత్యవసర పనులు ఉంటే మినహా పగటిపూట బయటకు రావద్దని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. బయటకు రావాలనుకుంటే టోపీ లేదా గొడుగు ధరించాలని, మొహానికి, శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఉష్ణతాపం నుంచి రక్షణగా మంచినీటితో పాటూ పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు సేవిస్తుండాలని చెప్తున్నారు. చెమటరూపంలో శరీరం లవణాలను కోల్పోతుంది. దీంతో రోజులో ఒక్కసారైనా ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని అంటున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా తరచూ పానీయాలు తాగుతూ జాగ్రత్తపడాలని తేల్చిచెప్తున్నారు. మండువేసవిలో టూర్లకు వెళ్లకపోవడమే మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. ఒకవేళ పర్యటనలు ప్లాన్ చేసుకున్నా చల్లగా ఉండే ప్రదేశాలనే ఎంపిక చేసుకోవాలని చెప్తున్నారు.