రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే, దీనినే *"వ్యామోహం"* అని అంటారు. మగ్గిన పండును చూసి పరవశించి, పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే *"వాత్సల్యం"* అని విశదీకరించారు. చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా, చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే *"ఆప్యాయత"* అని చాటి చెప్పారు. పండంతా ఆబగా తినిన తరువాయి కూడా, టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నారు. మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి, చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే *"అసూయ"* అని వివరించారు. మామిడిపండు చేతికి చిక్కాక, ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో, గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపారు. మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే *"అహంకారం"* అని చాటారు. మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని, దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే *"మమకారం"* అని తెలిపారు. అతిగా మామిడి పళ్ళు తిని, జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించారు.
*ఒక పండు ఆరగింపు ముద్దు,*
*రెండు కద్దు*
*మూడు అసలే వద్దు,*
*ఉండాలి దేనికయినా సరిహద్దు.*
దీనినే.... *స్వీయ నియంత్రణ* అని విపులీకరించారు మన పెద్దలు.
ఇదీ మామిడిపండు రసలీలాసారం