జీవితం గీత గీసినట్లుగా తిన్నగా సాగదు. అది మిట్టపల్లాలతో నిండి ఉంటుంది. ద్వంద్వాలతో కూడి ఉంటుంది. విరుద్ధమైన భావాల జోడీని ‘ద్వంద్వం’ అంటారు.
సుఖదుఃఖాలు, రాత్రింబవళ్లు, ఉదయాస్తమానాలు, శీతోష్ణాలు, చీకటి వెలుగులు, ఎండ-వానలు, శరీరం-ఆత్మలు, ధర్మాధర్మాలు, జనన మరణాలు, స్త్రీలు-పురుషులు అనే పడుగుపేకలతో కాలాత్ముడు ప్రకృతి వస్త్రాన్ని నేస్తాడు. ఈ ప్రకృతిలో చేతనాలు, అచేతనాలు (జీవులు, నిర్జీవులు) అనే ద్వంద్వాలు నిండి ఉన్నప్పుడు, ప్రకృతిలో భాగమైన మానవుడి జీవితంలో ద్వంద్వాలుండటం అసహజం కాదు.
జీవితంలో ద్వంద్వాలుండాలి. ఈ ద్వంద్వాలే మానవుణ్ని ఉత్తేజపరుస్తాయి. అతడికి ఆనందం అందిస్తుంటాయి. జీవితంలో ముందుకు సాగడానికి సహకరిస్తుంటాయి. కష్టాల నుంచి బయటపడినప్పుడే మానవుడు సుఖాన్ని అనుభవించగలడు. కష్టం ఎదురైందని ముందుకు వెళ్ళడం మానేస్తే, ఆ దరిమిలా వచ్చే సుఖాన్ని మానవుడు పొందలేడు. కష్టం తరవాతనే దాని జోడీ అయిన సుఖం వస్తుంది. చేదును రుచి చూశాకనే, తీపివస్తువులోని మాధుర్యం అనుభవానికి వస్తుంది. విరహం లేనిదే అనురాగంలోని అనిర్వచనీయ రుచి అర్థం కాదు. రాత్రి గడవనిదే, వెలుగు నిండిన పగలు రాదు. ద్వంద్వాలను అర్థం చేసుకొని, జీవితంలో ముందుకు సాగే ప్రయత్నమే మానవధర్మం అనిపించుకొంటుంది!
మానవ జీవితంలో శరీరం, బుద్ధి, మనసు అనే ముఖ్యమైన మూడు ఒకదానితో ఒకటి సంగమించాలని పెద్దలంటారు. ఈ మూడూ విడివడని లంకె వంటివి. వీటిని విడదీస్తే జీవితం లేదు. మూడింటి నుంచి బుద్ధిని విడదీస్తే, ఆ వ్యక్తిని మూర్ఖుడంటారు. మనసును పక్కన పెడితే, మనసు లేని ఆ వ్యక్తిని మానవత్వం లేని మొరటువాడని, కఠినాత్ముడని అంటారు. శరీరం లేనిదే జీవితం ఉండదు. అందుకే మానవుడు తన శరీరాన్ని కాపాడుకోవాలి.
అరిషడ్వర్గాల మీద విజయం సాధించడం మానవుడికి ఎంతో అవసరం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురూ అంతశ్శత్రువులు. వీళ్ళు బయటికి కనిపించరు. లోపలే ఉండి మనిషిని దెబ్బతీస్తుంటారు. వీళ్లను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మానవ జీవితం సుగమంగా ముందుకు సాగిపోతుంది.
కష్టాల్లో, ఆపదల్లో ఉన్న ప్రాణుల్ని చూసి వాళ్ల స్థానంలో మనమే ఉన్నట్లు భావించాలి. అప్పుడే అంతశ్శత్రువులు అంతరిస్తారన్నది, అనుభవ సారాన్ని ఇముడ్చుకొన్న పెద్దలు చెప్పే విలువైన మాట.
గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, మానవులు సమాజ ధర్మాన్నీ పాటించాలి. తమ సంతానం, తమ తల్లిదండ్రులు, తమ బంధుజనులు- కేవలం వీళ్ల శ్రేయస్సుకు పాటుపడటమే పరమావధి కాకుండా, ఇరుగుపొరుగుల బాగోగుల్నీ చూస్తుండాలి. తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరించాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల కోసం కూడా వెచ్చిస్తుండాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, భగవంతుణ్ని సేవించాలి. గృహస్థ జీవితంలో అనురాగ వాత్సల్యాలతో పాటు భక్తి, సేవ, త్యాగం ఉన్నందువల్ల- ఆ జీవితాన్ని పెద్దలు తపస్సుతో పోల్చారు.
రుషులు, మునులు లోకకల్యాణం కాంక్షించి తపస్సు చేశారు. ఫలితంగా వారు దైవానికి దగ్గరయ్యారు. సామాన్య గృహస్థులు సైతం సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ సేవలు సాగిస్తే, వారికీ సత్ఫలితమే లభిస్తుందని పెద్దలంటారు. ఇంతకు మించిన పరమార్థం మానవ జీవితానికి మరొకటి ఉండదు!
- కాలిపు వీరభద్రుడు
ఓం నమో నారాయణాయ