YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇళ్లకే పరిమితం అవుతున్న నేతలు

ఇళ్లకే పరిమితం అవుతున్న నేతలు

విజయవాడ, జూన్ 7,
ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి. అవకాశాలను అంది పుచ్చుకోవాలి. వాటి నుంచే రేపటి గెలుపునకు బాటలు వేసుకోవాలి. ఏపీలో ఏ సర్కార్ అధికారంలోకి వచ్చినా అలాగే చేసింది. నాడు కాంగ్రెస్ వ్యతిరేకతను చంద్రబాబు సొమ్ము చేసుకుంటే బాబు పాలన పట్ల జనాలలో వచ్చిన వ్యతిరేకతను మొత్తం జగన్ లాగేసుకున్నారు. ఇక జగన్ ఏలుబడి మీద జనాలకు ఎటువంటి వ్యతిరేకత లేదు కానీ కరోనా రెండవ దశలో మాత్రం పెద్ద ఎత్తున కేసులు మరణాలు పెరుగుదలతో ఆంధ్రా జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో పవర్ లో ఉన్న ప్రభుత్వాలనే ఎవరైనా నిందిస్తారు కాబట్టి అంత వరకూ చూస్తే జగన్ కి ఈ పరిణామాలు తలనొప్పిగానే ఉన్నాయి. కరోనా వేళ జనం వణుకుతున్నారు. ఎవరు ఎపుడు పోతారో తెలియక నరకమే చూస్తున్నారు. ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, కరోనా మందుల పేరిట కార్పోరేట్ ఆసుపత్రులలో దోపిడి. జగన్ సర్కార్ పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు దిగువ స్థాయిలో అమలు కాకపోవడం, అధికారుల ఉదాశీనత వంటి వాటి వల్ల జనాలకు ఎక్కడ లేని ఆగ్రహం వస్తోంది. ఈ క్లిష్ట సమయంలో వారికి మేమున్నామని భరోసా ఇచ్చే నాయకులు క్షేత్ర స్థాయిలో ఎవరూ కనిపించడంలేదు. చిత్రమేంటి అంటే జగన్ ఎటూ తాడేపల్లి ఆఫీస్ నుంచి బయటకు కదలడంలేదు. మరి తెలుగుదేశం లాంటి ప్రధాన‌ విపక్షం ఈ టైమ్ లో చేయాల్సింది చాలానే ఉంది కదా.చంద్రబాబు సంగతి సరే. ఆయన వయసు లో పెద్ద వారు కాబట్టి హైదరాబాద్ లో రెస్ట్ తీసుకోవచ్చు. మరి యువ నాయకుడు లోకేష్ కూడా ఎందుకు ప్రవాసంలో ఉంటున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. లోకేష్ ఎపుడో కరోనా తగ్గిన తరువాత ప్రజలలోకి వస్తాను అంటున్నారు. కానీ అపుడు వస్తే ప్రయోజనం ఏముంటుంది. ఈ ఆపద సమయంలో ఆయన ఏపీలోని పదమూడు జిల్లాలు తిరగాలి. కరోనా వైద్యం ఎలా సాగుతోందో వాకబు చేయాలి. అదే విధంగా అతి పెద్ద టీడీపీ సైన్యం ఉంది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న వారు ఉన్నారు. వారంతా కలసి కరోనా రోగులకు ఆర్ధికంగా ఇతరత్రా సాయం చేస్తే టీడీపీ సూపర్ గా ఫోకస్ అవుతుంది. రాజకీయాలు అంటూ నిత్యం జూమ్ యాప్ ద్వారా విమర్శలు చేయడం కాదు, కార్యాచరణతో టీడీపీ క్షేత్ర స్థాయిలోని వెళ్తే ఇపుడు వచ్చే ఆదరణ వేరుగా ఉంటుంది కదా. కానీ కనీసం ఆ దిశగా కూడా టీడీపీ పెద్దలు ఆలోచించకపోవడమే దారుణం అంటున్నారు.ఇక ఏపీలో జనాలు కరోనాతో పోరాడుతూంటే ప్రభుత్వం తాను చేయాల్సింది చేస్తోంది. రేపటి రోజున అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు చేష్టలుడిగి కూర్చోవడం కంటే బాధాకరం మరోటి ఉంటుందా అన్నదే జనాల ప్రశ్న. జనసేన పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇక బీజేపీ నేతలు కానీ ఇతర పార్టీల వారు కానీ విమర్శలు చేయడానికే ఉన్నామని చెబుతున్నారు తప్ప జనాల వద్దకు వెళ్ళి తమ వంతు గా సాయం ఎందుకు చేయడం లేదు అన్నదే చర్చగా ఉంది. నిజానికి కరోనా వంటి వాటి నుంచి రాజకీయ లబ్ది పొందకూడదు కానీ మేలు చేసిన వారిని జనాలు ఎప్పటికీ మరచిపోరు కాబట్టి స్వామి కార్యం తో పాటు స్వకార్యం కూడా నెరవేరుతుంది అన్న ధ్యాస‌రాజకీయ పక్షాలకు లేకపోవడమే చిత్రం. మొత్తానికి వైసీపీని నోటి మాటగా ఎన్ని విమర్శలు చేసినా జనాల్లో రియాక్షన్ ఉండదు, తాము కదలి వచ్చి ఆదుకుంటేనే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని ప్రతిపక్షాలు గ్రహించాలి. ఒక విధంగా కరోనా కూడా గోల్డెన్ చాన్స్ ఇచ్చేసింది కానీ అందిపుచ్చుకునేవారేరీ..

Related Posts