ఆసిఫాబాద్
కరోనా చికిత్స కోసం వచ్చి ఇటీవల వరంగల్ లో పోలీసులకు పట్టుబడిన మావోయిస్టు గడ్డం మధుకర్ మృతిచెందాడు. ఈ నెల 2న అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్ కరోనా చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందినట్టు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధుకర్ మృతదేహాన్ని పోలీసులు స్వగ్రామానికి తరలించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు గడ్డం మధుకర్.. ప్రస్తుత చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో విద్యనభ్యసించాడు. 1999లో పదో తరగతిలో ఉండగా బడికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నాడు. గ్రామ సంఘం సభ్యునిగా చేరి ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. కాగా, బాల్యదశలోనే తుపాకీ చేతపట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన తన కొడుకు 22 ఏండ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడన్న విషయం తెలుసుకున్న ఆ తండ్రి.. ఇప్పటికైనా తన కుమారుడ్ని చూసుకోవచ్చనీ, మాట్లాడొచ్చని సంతోషించాడు. తన కుమారుడ్ని ఒక్కసారి చూపించాలని పత్రికాముఖంగా పోలీసు అధికారులనూ వేడుకున్నాడు. రేపోమాపో కుమారుడ్ని చూస్తానన్న నమ్మకంతో ఉన్న ఆ తండ్రికి కుమారుడి పరిస్థితి విషమంగా ఉందన్న పిడుగు లాంటి వార్త చేరింది. శనివారం పోలీసులు మధుకర్ ఇంటికి వెళ్లి అతని పరిస్థితి చెప్పడంతో.. మధుకర్ తల్లిదండ్రులతో పాటు అక్కా బావ, ఇద్దరు తమ్ముళ్లు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. కానీ అప్పటికే మధుకర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. తాను బతికుండగా కుమారుడిని చూస్తానో లేదోనని బాధ పడ్డాననీ, కాని చనిపోయిన తన కుమారుడిని తాను బతికుండి. చూస్తానని అనుకోలేదంటూ ఆ తండ్రి బోరున రోదిస్తున్నాడు. ఈ రోజు ఉదయం మావోయిస్టు నేత గడ్డం మాధుకర్ అంతక్రియలు నిర్వహించారు..