న్యూఢిల్లీ జూన్ 7
కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్). లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్, యాంటీట్యూసివ్ మందులు మాత్రమే వాడాలని చెప్పింది. ఇన్నాళ్లూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తేల్చి చెప్పింది. జ్వరం కోసం యాంటీపైరెటిక్, జలుబు కోసం యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాలని తెలిపింది.అవనసరంగా పేషెంట్లకు సీటీ స్కాన్లు చేయించొద్దని కూడా డాక్టర్లకు సూచించింది. కొవిడ్‌ను అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే టెలీకన్సల్టేషన్లు జరపాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించింది. పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఫోన్‌లో, వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ ఉండాలని, సానుకూల విషయాలు చర్చించాలని చెప్పింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఎలాంటి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లయితే మాత్రం తాము వాడుతున్న మందులను కొనసాగించాలని సూచించింది.స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. దగ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాలని చెప్పింది. ఇక ఎలాంటి చికిత్స, మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.