న్యూఢిల్లీ జూన్ 7
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేటి నుంచి పిల్లలపై కరోనా టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 2-18 మధ్య వయస్సున్న పిల్లలకు అనుకూలంగా ఉంటుందా? లేదా? తెలుసుకునేందుకు దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో భారత్ బయోటెక్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తగినంత మందికి టీకాలు వేయకపోతే మూడో వేవ్‌లో వినాశనం సృష్టించే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే వేస్తున్నారు.2-18 ఏళ్ల మధ్య రెండు, మూడోదశ ట్రయల్స్ నిర్వహణకు భారత్ బయోటెక్‌కు మే 13న కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా, కెనడా, జపాన్, చైనా సహా పలు దేశాలు పిల్లలకు టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చాయి. మహమ్మారి రెండో దశలో ఆరోగ్య మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆసుపత్రుల్లో పడకలు, మెడికల్ ఆక్సీజన్ లేకపోవడంతో పెద్ద సంఖ్యలో రోగులు మృతి చెందారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్నది.ఏప్రిల్‌లో గరిష్ఠంగా 4లక్షలకుపైగా కేసులు నమోదవగా.. నిన్న 1.14లక్షల తాజా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లోనే అతి తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇప్పుడు పిల్లలపై ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. అనేక రాష్ట్రాలు ప్రత్యేకంగా పిడియాట్రిక్ ఐసీయూలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.