కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇటు యాడ్ లు, అటు పాటలతో కన్నడ గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ విపరీతంగా శ్రమిస్తున్నాయి. కన్నడనాట జెండా పాతాలని బీజేపీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని విపరీతంగా శ్రమిస్తుంది. ఇక ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ (ఎస్) కూడా వీలయినన్ని స్థానాలను దక్కించుకుని కింగ్ అవ్వాలని తపన పడుతోంది. నేతల ప్రసంగాలకు ఓట్లు రాలతాయో లేవో? అన్న అనుమానంతో అన్ని పార్టీలూ ప్రకటనలు, పాటలతో హోరెత్తిస్తున్నాయి.ఇక జనతాదళ్ ఎస్ కూడా ప్రకటనలతో దూసుకెళుతుందనే చెప్పాలి. తాజాగా జేడీఎస్ రూపొందించిన పాట విపరీతంగా కర్ణాటకలో వైరల్ అవుతుంది. 1970లోని ఒక పాటను జనతాదళ్ ప్రచార కమిటీ దీన్ని రీమిక్స్ చేసింది. దాదాపు 200 పాత పాటలను రీమిక్స్ చేసిన జనతాదళ్ ఎస్ వీటిని గ్రామ గ్రామాన ప్రచారం చేస్తోంది. ఈ పాటలు ఆకట్టుకుంటున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు 300 కన్నడ పాటలను రీమిక్స్ చేసేందుకు జేడీఎస్ లో ప్రత్యేక టీం పనిలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నేతల ఊకదంపుడు ఉపన్యాసాల కన్నా వీనుల విందైన పాటలే ఓట్లు కురిపిస్తాయన్నది జేడీఎస్ నమ్మకం కావచ్చేమో. 1960 నాటి పాటలను ప్రచారం చేస్తూ జనతాదళ్ ఎస్ ప్రచారంలో కొత్త పంథాను అనుకరిస్తోంది. కన్నడ నాట కాంగ్రెస్ రూపొందించిన యాడ్ విపరీతంగా వైరల్ అవుతుంది. వై…దిస్…కొలవెరీ సాంగ్ ను రీమిక్స్ చేసి వై..దిస్ యడ్యూరప్ప అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన యాడ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కమలనాధులు కూడా ప్రకటనలతో దూసుకుపోతున్నారు. సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీల అవినీతిపై చేసిన ప్రకటన ప్రజలను అలరిస్తోంది. అయితే ఈ ప్రకటనల విషయంలో బీజేపీకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బీజేపీ తయారు చేసిన మూడు ప్రకటనలను ఎన్నికల కమిషన్ నిషేధించడం విశేషం. జన విరోధి సర్కార, విఫల సర్కార, మూరు భాగ్య అంటూ బీజేపీ చేసిన ప్రకటనలు ప్రసారం చేయకూడదని ఎన్నికల కమిషన్ నిర్ణయించడ విశేషం.వీటిని వాట్సప్ గ్రూపుల్లో పెడతుండటంతో వాటిని ఎంజాయ్ చేస్తున్నారు కన్నడనాట ప్రజలు.మొత్తం మీద పాటలు, యాడ్లతో ఓట్లు పడతాయా? లేదా? అన్నది మే 15వ తేదీన తేలనుంది.