YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హూజూరాబాద్ లో ఎత్తులు.. పై ఎత్తులు

 హూజూరాబాద్ లో ఎత్తులు.. పై ఎత్తులు

కరీంనగర్, జూన్ 7, 
భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో పార్టీకి ఎలాంటి నష్టం కలగకూడదని.. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఈటలను ఓడించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదిపింది. అదే జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ సహా ట్రబుల్ షూటర్ హరీష్ రావుని రంగంలోకి దింపింది. హుజూరాబాద్‌లో పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవడంతో పాటు ఈటలను ఒంటరిని చేయాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది.అందులో భాగంగానే స్థానిక నేతలతో మంత్రులు హరీష్ రావు, కమలాకర్ భేటీలు జరిగాయి. ఈటల రాజేందర్ బయటికి వెళ్లినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే ఊహించని విధంగా టీఆర్‌ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. హుజూరాబాద్ పరిధిలోని వీణవంక మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ, మరో ఏడు గ్రామాల సర్పంచులు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఎనిమిది గ్రామాల అధ్యక్షులు కూడా ఈటల వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.అంతేకాకుండా ఈటల రాజేందర్‌కి మద్దతుగా మండల కేంద్రం వీణవంకలో భారీ ప్రదర్శన నిర్వహించడం కూడా హాట్‌టాపిక్‌గా మారింది. హుజూరాబాద్‌లో పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా మంత్రులను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. సీనియర్ నేత హరీష్ వ్యూహాత్మకంగా వ్యవహరించినా ఫలితం లేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కీలక నేతలు ఈటల వెంట నడిచేందుకు సిద్ధమవడంతో ఆయన పైచేయి సాధించినట్టైంది. ఈ ఘటనతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే ఈటలను ఢీకొనడం అంత సులువేం కాదని గులాబీ పార్టీకి తెలిసొచ్చిందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Posts