కోల్ కత్తా, జూన్ 7,
పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల తర్వాత అనూహ్యస్థాయిలో చెలరేగిన హింసాకాండ పట్టిపీడిస్తోంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.. వందల కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి.. హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి..’’ అంటూ గవర్నర్ మరోసారి అగ్గి రాజేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమన్లు జారీచేసిన గవర్నర్.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా భయంకరంగా ఉన్నాయి.. భద్రతా వాతావరణం తీవ్రంగా రాజీ పడింది. అటువంటి భయంకరమైన పరిస్థితి గురించి వివరించాలి.. ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసను కట్టడిచేయడానికి తీసుకున్న అన్ని చర్యలను సీఎస్ తెలియజేయాలి’’ గవర్నర్ ట్వీట్ చేశారు. గవర్నర్ వరుస ట్వీట్‌లతో విరుచుపడ్డారు. ఘాటు పదాలతో కూడిన రెండు పేజీల లేఖను గవర్నర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. సామాజిక బహిష్కరణ, అర్హత ఉన్నా పథకాలను తిరస్కరించడం బాధాకరం. సొంత ఇళ్లు ఉన్నా లేదా సొంత వ్యాపారాన్ని నడుపుకుంటున్నవారి వద్ద ‘దోపిడీ’.. వీటిని మమతా యంత్రాంగంలోని రాష్ట్ర కార్యనిర్వాహకులు గుర్తించి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం’’ అని గవర్నర్ విమర్శించారు. పశ్చిమ్ బెంగాల్, కోల్‌కతా పోలీసులు.. దురదృష్టవశాత్తు రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవటానికి పాలకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. బెఅయితే, ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాల రోజు సాయంత్రం నుంచి అక్కడ చెలరేగిన హింసపై గవర్నర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అల్లర్లు జరిగిన కూచ్ బెహర్, నందిగ్రామ్‌లో గవర్నర్ పర్యటించి అక్కడ ప్రజలను కలుసుకున్నారు.గవర్నర్ రాజకీయ విమర్శలు చేస్తూన్నారంటూ అధికార తృణమూల్ ధీటుగానే బదులిస్తోంది.