కడప, జూన్ 8,
ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏ ఎన్నికలు జరిగినా వరుసగా ఓటమి పాలవుతోంది. దీంతో టీడీపీ నాయకత్వంపై కార్యకర్తల్లో సంక్షోభం నెలకొంది. దీంతో అందరూ ఎన్టీఆర్ ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనైతేనే పార్టీని నడిపించగలరని ప్రతి సభలోనూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అదే ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. ఇక ఎంతమంది ఎన్ని రకాలుగా డిమాండ్ చేసినా.. ఎన్టీఆర్ మాత్రం తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నారు. అంతే గానీ ఎక్కడా రాజకీయాల ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ నందమూరి, టీడీపీ అభిమానులు మాత్ర ఎన్టీఆర్ జపం వదలట్లేదు.ఇప్పుడు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. కుప్పంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లో జెండాను ఆవిష్కరించారు టీడీపీ కార్యకర్తలు. 40 అడుగుల ఎత్తులో తాజాగా జెండా ఏర్పాటు చేసిన అభిమానులు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు సమయంలో కూడా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలానే కాకరేపారు. పార్టీ అధినేత ఇలాకా కుప్పంలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు. కొందరైతే రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో “రావాలి జూనియర్… కావాలి ఎన్టీఆర్” అంటూ నినదించారు తెలుగు తమ్ముళ్లు.డిమాండ్ రాష్టవ్యాప్తంగా ఎంతోకాలంగా ఉన్నప్పటికీ నాలుగడుగులు ముందుకేసి జూనియర్ ఎన్టీఆర్‌ను కుప్పం తీసుకురావాలని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే సరాసరి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధినేత టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసి తెలుగుదేశం పార్టీలోనే కొత్త చర్చకు తెరతీశారు. ఇప్పుడు మళ్లీ జై జై.. జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినదిస్తున్నారు.నియోజకవర్గంలోని కుప్పం మండలం మంకల దొడ్డి పంచాయతీ మలకల పల్లిలో ఎన్టీఆర్ డిమాండ్ కు నిదర్శనంగా ఈ జెండాను ఆవిష్కరించారు అభిమానులు. దీంతో టీడీపీలో మళ్లీ కలవరం మొదలయింది.