YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

భారీగా పెరిగిన ఆదాయం

భారీగా పెరిగిన ఆదాయం

న్యూఢిల్లీ, జూన్ 8, 
సాధారణంగా ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు, పన్ను వసూళ్లు తగ్గుతాయి. కరోనా సమయంలో పన్ను ఆదాయం తగ్గడానికి బదులు మనదేశంలో పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను ఆదాయం రూ.67,133 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 4.9శాతం పెరిగింది!  నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన అంచనాల కంటే వాస్తవ వసూళ్లు 5.9శాతం అధికంగా ఉన్నాయి. జాతీయ ఆదాయంలో పన్నుల వాటా  7.3 శాతానికి పెరగడంతో ఆఫీసర్లు  కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. కరోనా కారణంగా జీడీపీ భారీగా పడిపోతున్న సమయంలో పన్నుల వసూళ్లు భారీగా పెరగడం విచిత్రమే! ఈ ఆర్థిక సంవత్సరంలోనూ  భారీ వసూళ్లు కొనసాగుతాయా ? అనేది వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. కరోనా వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎకానమీ విపరీతంగా నష్టపోయింది. మూడో వేవ్ కు కూడా అవకాశాలు ఉన్నాయని  వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మరో వేవ్ రాకపోతే పన్నుల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీలోనూ లోపాలను పూడ్చారు కాబట్టి మరింత డబ్బు వస్తుందని అంటున్నారు. పరోక్ష పన్నులు కూడా భారీగా పెరుగుతుండటం ప్రభుత్వానికి మరో ప్లస్ పాయింట్. గత ఆర్థిక సంవత్సరంలో  పరోక్ష పన్నుల ద్వారా  ఆదాయం భారీగా పెరిగింది.   కస్టమ్స్‌‌ సుంకాల ఆదాయం 23శాతం (రూ. 25,473 కోట్లు),   కేంద్ర ఎక్సైజ్ సుంకాల ఆదాయం 62శాతం (రూ. 1,50,210 కోట్లు) పెరిగింది.  ఈక్విటీ మార్కెట్లు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. "ఇతర పన్నుల" ఆదాయం 30శాతం (రూ. 4,903 కోట్లు) పెరిగింది.  బంగారం దిగుమతులు (22.5శాతం పెరుగుదల), పెట్రో ధరల దూకుడు, మార్కెట్లో భారీ లావాదేవీల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పన్నుల ఆదాయం వచ్చింది. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో డిజ్ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం.. రూ.1.75 లక్షల కోట్లు కనుక వస్తే, పన్ను వసూళ్లు మరింత మెరుగుపడతాయి. బకాయిల రికవరీపై కూడా దృష్టి పెట్టాలి ”అని సీబీడీటీ మాజీ చైర్మన్, - సుధీర్ చంద్ర అన్నారు. కేంద్రం వాటా  ఏడాది క్రితం కాలంతో పోల్చితే  రూ.37,723 కోట్లు  (సీజీఎస్టీ మాత్రమే) తగ్గింది. ఇదేమీ పెద్ద విషయం  కాదు. జాతీయస్థాయిలో లాక్డౌన్ అమలు చేయడమే ఇందుకు కారణం.  కార్పొరేట్ పన్ను వసూళ్ల ఆదాయం కూడా 2019–-20 తో పోలిస్తే  రూ.లక్ష కోట్లు  తగ్గింది.  కార్పొరేట్ పన్ను రేటును 30శాతం నుండి 22శాతం వరకు తగ్గించడం ఇందుకు కారణం. వ్యక్తిగత పన్నుల ఆదాయం కూడా  సంవత్సరంలో కేవలం 2.3శాతం (రూ. 11,122 కోట్లు) మాత్రమే తగ్గింది. భారీ ఉద్యోగ నష్టాలు, జీతాల కోతల వల్ల జనం ఆదాయం పడిపోయింది. ఈ విషయమై ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా మాట్లాడుతూ ‘‘వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పడిపోలేదు. ఎందుకంటే  డివిడెండ్ ఆదాయంపై పన్ను కంపెనీల నుండి వాటాదారులకు బదిలీ అయింది. రెండోది.. ఐటీ రిటర్నులతో జీఎస్టీ ఫైలింగులను పోల్చుతున్నారు.  చిన్న సంస్థలు వాటి ఆదాయాన్ని మరింత ఖచ్చితంగా చూపించాలని బలవంతం చేస్తున్నారు”అని ఆయన వివరించారు. వీటి నుంచి వసూలు చేసిన పన్నులు వ్యక్తిగత ఆదాయపు పన్ను కేటగిరీలోకి వెళ్తాయి.  “ప్రమోటర్లు, పెద్ద వాటాదారులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌లు డివిడెండ్లపై పన్ను కడతారు. వీళ్లు 43శాతం ట్యాక్స్ బ్రాకెట్ లోకి వస్తారు.  అందుకే గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత పన్ను కేటగిరీలో మొత్తం వసూళ్లు  (రూ. 4.7 లక్షల కోట్లు) పెరిగాయి. సెకండ్ వేవ్ రాకుంటే రాబోయే 3 క్వార్టర్లలో కార్పొరేట్ పన్ను వసూలులో పెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2019–-20 కంటే 2020–-21లో ఎక్కువ పన్ను చెల్లించిన నిఫ్టీ కంపెనీల్లో బీపీసీఎల్,  గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ,జెఎస్‌‌‌‌డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్  టాటా స్టీల్, ఐఓసి వంటివి ఉన్నాయి. అత్యధికంగా కార్పొరేట్ పన్ను కట్టిన కంపెనీల్లో టీసీఎస్, హెచ్‌‌‌‌డిఎఫ్‌‌‌‌సి బ్యాంక్, ఐఓసీ, భారతీ ఎయిర్‌‌‌‌టెల్,  స్టేట్ బ్యాంక్ ఉన్నాయి.  ఇవన్నీ అద్భుత పనితీరు కనబర్చి ఆదాయాన్ని పెంచుకున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) మాజీ చైర్మన్ ఆర్ ప్రసాద్ చెప్పారు. కొన్ని వస్తువులపై పరోక్ష పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనివల్ల వాటిని మరింత ఎక్కువ కొనుగోలు చేస్తారన్నారు. ఈ విషయమై సుధీర్ చంద్ర స్పందిస్తూ  తక్కువ పన్ను రేట్ల వల్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు కచ్చితంగా పెరుగుతాయని అన్నారు. ఈ–ఇన్వాయిసింగ్ అమలు వల్ల జీఎస్టీ వసూళ్లలోనూ పెరుగుదల ఉండవచ్చని చెప్పారు.  మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ మాట్లాడుతూ 2020–21 కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చని అన్నారు. సెకండ్ వేవ్ కార్పొరేట్ రంగాన్ని కూడా దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు.  కొన్ని ప్రొడక్ట్‌‌లపై  జీఎస్టీ తగ్గిస్తే కొనుగోళ్లతో పాటు పన్ను వసూళ్లూ పెరుగుతాయన్నారు.

Related Posts