YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అన్ లాక్ దిశగా రాష్ట్రాలు... శాంతించిన సెకండ్ వేవ్

అన్ లాక్ దిశగా రాష్ట్రాలు...  శాంతించిన సెకండ్ వేవ్

న్యూఢిల్లీ, జూన్ 8, 
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. మారణహోమం సృష్టించిన సెకండ్ వేవ్‌లో ఇప్పుడు రోజువారీ కేసులు లక్షలకు దిగి వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి రోజువారీగా నమోదవుతున్న కేసులు లక్ష కు అటూ ఇటూ ఉండగా.. కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు… అర శాతానికి తగ్గింది. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా తగ్గుతోంది. సెకండ్ వేవ్ కాస్త ఊపిరి సలపనిస్తోందని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ ఆన్ లాక్ బాటలో ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఇప్పటికే అన్ లాక్ -1 ప్రకటించాయి. ఢిల్లీలో కూడా సాధారణ జన జీవనం వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలు కూడా.. నైట్ కర్ఫ్యూ మాత్రమే ఉంచి.. ఇక యధావిధిగా ప్రజాజీవనం ఉండేలా చూడాలని నిర్ణయించున్నారు. అధికారిక ప్రకటన రెండు, మూడు రోజుల్లోనే రానుంది. ఇప్పుడు ఆనందం సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోందని కాదు. నిజానికి సెకండ్ వేవ్.. దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ఎంతగా అంటే.. ప్రతి వ్యక్తి ఆత్మీయుల్ని కోల్పోయారు. అది కుటుంబసభ్యులైనా కావొచ్చు… స్నేహితులైనా కావొచ్చు. ఏ వ్యక్తిని కదిలించినా.. తమ ఆత్మీయుల్ని కోల్పోయామనే చెబుతున్నారు. అంటే ఎంత దారుణమైన మారణహోమం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మరణాలన్నీ వైరస్ వల్ల అనడం కన్నా… నిర్లక్ష్యం వల్ల అని అనుకోవడమే అసలైన నిజం. నిపుణుల హెచ్చరికలను పక్కన పెట్టేసి ఎలాంటి సింసిద్ధత ఏర్పాట్లు చేసుకోకపోవడం.. దాహం వేసినప్పుడే బావి తవ్వుకున్న చందంగా.,.. ఊపిరి ఆడని పేషంట్ల కోసం అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలని ప్రయత్నించడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మహమ్మారి దాటికి ప్రాణాలు కోల్పోయిన వారు తప్ప.. బతికిన వారందర్నీ తామే బతికించామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఇప్పుడు ధర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గత ఏడాది పెద్దలపై కరోనా ప్రభావం చూపితే.. ఈ సారి యువతపై చూపింది. ధర్డ్ వేవ్‌ పిల్లలపైనే అధికంగా ఉంటుందన్న ప్రచారం ఉంది. భావి పౌరులకు నష్టం జరిగితే.. అది దేశానికి తీవ్ర నష్టం చేస్తుంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. అంత మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమైనా ముందు చూపుతో ఉన్నాయో లేవో అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం దేశంలో అప్పీజ్‌మెంట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏం చేసినా.. చేయకపోయినా.. ప్రజలకు ఎంతో కొంత నగదు రూపంలో సాయం చేస్తే చాలు.. తమ అధికారానికి ఢోకా ఉండదని నమ్ముతున్నారు. ఫలితంగా.. పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం లేదు. ఆ విషయం గత ఏడాది కరోనా వచ్చిన తర్వాత దేశంలో వైద్య మౌలిక సదుపాయాల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతోనే తేలిపోయింది. ఇక ముందైనా గుణపాఠం నేర్చుకుంటారో… లేక ధర్డ్ వేవ్‌లో పిల్లల్ని బలి చేస్తారో వేచి చూడాలి..!  

దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ వస్తోంది. పలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గనప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అన్‌‌లాక్ దిశగా పలు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. జూన్ 7 నుంచి ఢిల్లీలో మెట్రో సేవలు 50 శాతం కెపాసిటీతో షురూ అయ్యాయి. అలాగే మార్కెట్‌‌లు, మాల్స్ కూడా సరి, బేసి పద్ధతిలో తెరుచుకోనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌‌లో కూడా ఈనెల 8నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని యోగి సర్కార్ తెలిపింది. కంటైన్‌‌మెంట్ జోన్‌‌ల్లో వారంలో ఐదు రోజులపాటు మార్కెట్‌లు, షాపులు తెరుచుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. రాజస్థాన్‌‌లో ఈనెల 2వ తేదీ నుంచి అన్‌‌లాక్ ప్రక్రియ మొదలైంది. పలు సడలింపులతో అన్‌‌లాకింగ్‌‌ను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ చేసింది. మన రాష్ట్రంలో ఈ నెల 9 వరకు లాక్‌‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా సడలింపులతో అన్‌లాక్ ప్రక్రియను మొదలెడతారా అనేది త్వరలో తేలనుంది.

Related Posts