హైదరాబాద్, జూన్ 8,
కరోనా టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగాన్ని కుదిపేసింది. ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలను ఆవిరి చేసింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ట్రావెల్ అండ్ టూరిజంపై ఆధారపడిన వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ట్రావెల్స్ నిర్వహణ ఖర్చులు, కుటుంబ పోషణ భారమై రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వసాయం కోసం ఎదురు చూస్తున్నారు.రాష్ట్రంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో 10,000 మంది ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దాదాపు 10 లక్షలమంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతుండగా, మరో 50 లక్షలు పరోక్షంగా ఆధారపడ్డారు. రాష్ట్ర జీడీపీలో 10శాతం పర్యాటక పరిశ్రమది. 2014 వరకు కేవలం 75,000 విదేశీ పర్యాటకులు వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పర్యాటకుల సంఖ్య 3.5 కోట్లకు చేరింది. దేశానికి, రాష్ట్రానికి ఆర్థిక విలువలు, అవసరమైన విదేశీ మారకద్రవ్యం అందించడంలోనూ టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగం కీలక భూమిక పోషిస్తుంది. కరోనాకు ముందు దేశీయ ప్రయాణికులతో దాదాపు రూ.10 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు మహమ్మారి కారణంగా అన్నీ మాయమయ్యాయి. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పర్యాటక రంగంపై ఆంక్షలు విధించింది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని పుణ్యక్షేత్రాలుగానీ, పర్యాటక ప్రాంతాలకు గానీ అనుమతిని రద్దు చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలను నిర్వహకులు మూసి వేశారు. గతేడాది కరోనా నుంచి మూసి వేయడంతో ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కనీసం పనిచేసే సిబ్బందికి సైతం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రజలకు ఆనందం, వినోదానికి ట్రావెల్ అండ్ టూరిజం దోహద పడుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ప్రదేశాలను చూడటాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే ట్రావెల్స్ ను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఏజెంట్లు, టూర్ ఆపరేట్లకు గడ్డుకాలం ఏర్పడింది. దాని నుంచి కొంత ఉపశమనం కలగాలంటే రాష్ట్రంలోని పరిసరాల పర్యాటకం, గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దిశగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతిస్తే ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమ ‘మనుగడ’సాగించే అవకాశాలున్నాయి.రాజధానిలో గోల్కొండతో పాటు రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా లక్నవరం, ములుగు జిల్లాలో బోగాత వంటి అనేక జలపాతాలు, తీర్థయాత్రలు వంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఆదిలాబాద్ కోట, కరీంనగర్లో ఎలగందల్ కోట, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో అంకాళమ్మ కోట, నిజామాబాదు జిల్లా, జుక్కల్లో కౌలస్ కోట, ఖమ్మం కోట, కుసుమంచి గణపేశ్వరాలయం, మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల కోట, మహబూబ్ నగర్ జిల్లాలోని గిరి దుర్గాలలో ఒకటి ఘనపురం ఖిల్లా, చంద్రఘడ్ కోట, పానగల్ కోట, రాజోల్ కోట, నల్లగొండ జిల్లాలో యాదాద్రి, దేవరకొండ కోట, భువనగిరికోట, కామారెడ్డిలో దొమకొండ కోట, మెదక్ కోట, వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి, కొమురంభీం జిల్లాలోని జోడేఘాట్ లో సప్తగుండాల జలపాతాలు, మహబూబ్ నగర్ లో సలేశ్వరం జలపాతం, జగిత్యాలలో కొండగట్టు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామంలో మహేశ్వరాలయం, నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రముఖ ప్రదేశాలు.తక్షణ సాయంగా ఏజెంట్లకు, ఆపరేట్లకు 2022 మార్చి వరకు నెలకు రూ.5వేలు. రాబోయే 3 ఆర్థిక సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా రూ. 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలివ్వాలి. రూ .25 లక్షలకు పైబడిన మొత్తానికి నామమాత్రపు వడ్డీ వసూలు చేసేలా చూడాలి. కార్యాలయాలకు 2021-2022 వరకు ఆస్తిపన్ను మినహాయింపు. పర్యాటక, ప్రయాణ పరిశ్రమలపై ఆధారపడిన వారికి టీకా వేయాలి. ప్రత్యేకంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేటాయింపు. అత్యవసర సేవల కింద సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2లక్షలు వడ్డీలేని రుణం. సిబ్బంది పిల్లలకు పాఠశాలలు, కళాశాలలలో ఫీజు మినహాయింపు. కేరళ, గుజరాత్, మణిపూర్ తరహాలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. మణిపూర్, ఏపీ ప్రభుత్వాల మాదిరిగా పునరుద్ధరణ ప్యాకేజీలను ప్రకటించాలి.