*జ్యోతిష్యశాస్త్రపరంగా తారామండలంలోని నక్షత్ర వీధులు, వాటివలన ఏర్పడే మార్గాలు, మరణించిన తరవాత జీవుడు పయనించే మూడు ముఖ్యమైన ఉత్తర, దక్షిణ, మధ్య [ మోక్ష] మార్గాల గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకోండి.*
*ఈ భూమ్మీద జీవుడు మరణించాక సూక్ష్మ దేహాన్ని ధరించి అంతరిక్ష మార్గం ద్వారా పరలోకానికి వెళ్తాడు అని మనపురాణాలు చెప్తున్నాయి. జీవుడు చేసుకున్న కర్మల ప్రకారం అతడి సూక్ష్మశరీరం ఏ మార్గం గుండా వెళ్తుంది, అంతరిక్షంలో ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అన్నది వాయు పురాణంలో విపులంగా చెప్పబడింది. దీనికి జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఉండటం విశేషం.*
*అదేంటో ఎలాగో ఇప్పుడు చూద్దాం.*
*మన భారతీయ వేదాంగాలలో ప్రముఖమైనదిగా చెప్పబడే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం తారామండలాన్ని గణిత సౌలభ్యం కోసం మన ఋషులు వాటిని మొత్తం 27 నక్షత్రాలు గా విభజించారు.*
*వాటిల్లో మూడేసి నక్షత్రాలని ఒక జట్టు చొప్పున పెడితే అదొక “వీధి” అవుతుంది. అలాంటివి మూడు వీధులు కలిపి ఒక “మార్గం” అవుతుంది. ఆ విధంగా అంతరిక్షంలో మూడు మార్గాలు ఉన్నాయని శాస్త్రం చెపుతోంది. ఇక్కడ “మార్గము” అంటే జీవుడు మరణించిన తరవాత సూక్ష్మ దేహాన్ని ధరించి తన కర్మానుసారం పరలోకాలకు వెళ్ళే మార్గం అని అర్ధం.*
*సూర్యమండలం ద్వారా అంతరిక్షంలోకి ఉత్తర, దక్షిణ, మధ్య అనే మూడు మార్గాలున్నాయి. పైన చెప్పినట్టు మూడేసి నక్షత్రాలని ఒక జట్టుగా పెడితే అది ఒక వీధి అవుతుంది. అలా మూడు వీధులు కలిస్తే ఒక మార్గం అవుతుంది. ఆ విధంగా 27 నక్షత్రాలని మూడేసి చొప్పున ఒక జట్టుగా చేస్తే ..*
*మొదటి మూడు నక్షత్రాలు అయిన అశ్వని, భరణి, కృత్తిక ఈ మూడు కలిపితే దాన్ని “నాగవీధి” అంటారు. రోహిణి, మృగశిర, ఆరుద్ర ఈ మూడు కలిపితే దాన్ని “గజవీధి” అంటారు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ మూడు కలిపితే దాన్ని “ఇరావతవీధి” అంటారు.*
*అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “ఉత్తరమార్గం” లేదా “ దేవయానమార్గం” అని అంటారు.*
*తరువాత నక్షత్రాలు అయిన మఖ, పుబ్బ, ఉత్తర ఈ మూడు కలిపితే దాన్ని “ఆర్షతీవీధి” అంటారు. హస్త, చిత్త, స్వాతి ఈ మూడూ కలిపితే దాన్ని “ గోవీధి” అంటారు. విశాఖ, అనురాధా, జ్యేష్ట ఈ మూడూ కలిపితే దాన్ని “ జారద్గవీవీధి” అంటారు.*
*అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “మధ్యమమార్గము” అంటారు.*
*తరువాత నక్షత్రాలు అయిన మూలా, పూర్వాషాడ, ఉత్తరాషాడ ఈ మూడు కలిపితే దాన్ని “అజవీధి” అంటారు. శ్రవణ, ధనిష్ట, శతభిషం ఈ మూడు కలిపితే దాన్ని “మృగమార్గం” అంటారు. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ మూడు కలిపితే దాన్ని “ వైశ్వానరీవీధి “ అంటారు.*
*అలా పైన చెప్పిన మూడు నక్షత్ర వీధులని కలిపితే దాన్ని “దక్షిణామార్గం” లేదా “పితృయానం ” అంటారు.*
*గగనమండలంలో ఉన్న అగస్త్య ముని నక్షత్రానికి ఉత్తరంగా “అజవీధికి” దక్షిణంగా ఉన్నది “దక్షిణమార్గం” లేదా “పితృయానం” మార్గం. ఈ దక్షణమార్గంలో అగ్నిహోత్రాదులని చేసే మహాత్ములైన ఋషులు బ్రహ్మదేవుని ఋజ్మంత్రములతో స్తుతిస్తూ ఉంటారు.*
*ఈ మార్గమే చలనము [ వినాశన స్వభావము ] కలది అవటం వలన ప్రతి యుగంలోనూ బ్రహ్మ దీన్ని మళ్ళా పునః సృష్టి చేస్తూ ఉంటాడు. ప్రతి ఫలాపేక్షతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళే ఈ దక్షిణమార్గం నుంచి వెళ్తారు. చేసిన కర్మలు వాటి ఫలాలు మళ్ళీ అనుభవించడం కోసం వాటికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళ వాళ్ళ సంతతికి చెందిన కుటుంబాల్లోనే పుడతారు. అలా మితిలేని కోరికలతో పుడుతూ చస్తూ రాక పోకలు చేసేవాళ్లకే ఈ దక్షిణమార్గం అని చెప్పబడింది.*
*తరువాత “ఉత్తరమార్గము” లేదా దేవయానమార్గము”. ఇది కూడా అగస్త్యముని నక్షత్రానికి ఉత్తరముగానూ, “నాగవీధి” దేనికి ఉత్తరమవుతుందో, సప్తఋషీమండలము దక్షిణమవుతుందో అదే సూర్యునికి కూడా ఉత్తర మార్గము అవుతుంది. దానినే “ఉత్తరమార్గము” లేదా “దేవయాన మార్గము” అని అంటారు.*
*పరమ సిద్ధులు, బ్రహ్మచారులే ఈ “దేవయానమార్గం” లోకి ప్రవేశిస్తారు. సంతానాన్ని ఎవరైతే నిరసిస్తారో [ అంటే ఇంకా ఏ విధమైన మమతానురాగబంధాలు లేకుండా] వాళ్ళే మృత్యువుని కూడా జయిస్తారు అని చెప్పబడింది.*
*ఈ దేవయాన మార్గానికి ఎనభైవేల మండి ఊర్ధ్వరేతస్కులైన [ అస్కలన ]మునులు రక్షణగా ఉంటారని చెప్పబడింది. ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు అక్కడే ఉంటారు.*
*ఎందుకంటే కామలోభోపహతులు కాకుండా కేవలం మైధునాన్ని వర్జించిన వాళ్ళు మళ్ళా అటువంటి వాటిపైకి తిరిగే అవకాశం ఉండటం వలన. కేవలం పరిశుద్ధాంతః కరణులైన వాళ్ళే శాశ్వత మైన అమృతత్వాన్ని, జన్మరాహిత్యాన్ని పొందుతారు గనక వాళ్ళు ఆభూతసంప్లవము వరకూ [ సమస్త వాసనలు అణు మాత్రమూ కూడా మిగలకుండా నశించే వరకూ ] వాళ్ళు ఈ మార్గంలోనే ఉంటారు అని చెప్పబడింది.*
*తరువాతది “ మధ్య మార్గము’. సప్తఋషి మండలానికి పైన ఉత్తరంగా ఎక్కడ దృవనక్షత్రం స్థిరంగా ఉంటుందో అది మూడవ మార్గమైన “ మధ్యమార్గము” ఇది గగనమండలంలో చాలా దేదీప్యమానంగా ఉంటుందని చెప్పబడింది. దీన్నే “విష్ణుపదం” “మోక్షపదం” అంటారు. ఈ పదం పరమపదం.*
*ఇది నిర్దోషులైన సంయతాంతఃకరణులైన యతులకు వాళ్ళ పుణ్యపాపములు సమూలంగా నాశనమవ్వడం వలన లభిస్తుంది. అశేషమైన పుణ్యపాపాలు నశిస్తే గానీ పూర్తిగా దుఃఖం నశించదు. ఎక్కడ దుఃఖం ఉండదో అదే విష్ణుపదం. అదే పరమపదం. ఇది మామూలు కంటికి ఎంత మాత్రమూ కనపడనిది. ఎవరు జ్ఞానయోగంలో తన్మయులవుతారో కేవలం వాళ్ళ జ్ఞాన నేత్రాలకు మాత్రమే అది కనపడుతుంది. అలాంటి వాళ్ళందరూ అక్కడ సుఖంగా ఉంటారు.*
*ఇలాంటి అనేక విషయాలతో కూడిన జ్యోతిష్య శాస్త్రం అనంతమైన కాలపరిజ్ఞానానికి ఎంతో ఉపయుక్తమైంది. “ అప్రత్యక్ష్య మన్యశాస్త్రం ప్రత్యక్ష్యం జ్యోతిషంస్కృతం” అన్న ప్రమాణం నిజంగా నిజమైనది ! -*
*(ఆర్షవిజ్ఞాన సర్వస్వం అను గ్రంధం నుంచి జరిగింది.)*
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో