న్యూఢిల్లీ జూన్ 8
కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసిన నేపద్యం లో ఈ ప్రక్రియకు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి మాకు సప్లిమెంటరీ గ్రాంట్లు అవసరం లేదు. తగిన నిధులు ఉన్నాయి. పార్లమెంటర్ శీతాకాల సమావేశాల సమయంలో వచ్చే రెండో రౌండ్‌కు ఈ అవసరం రావచ్చు. ప్రస్తుతమైతే డబ్బు ఉంది అని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.అంతేకాదు తన వ్యాక్సిన్ అవసరాల కోసం విదేశీ వ్యాక్సిన్లపై కూడా ప్రభుత్వం ఆధారపడటం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈల నుంచే వ్యాక్సిన్లు సేకరించాలని భావిస్తున్నాం. వీటి నుంచే చాలా వరకూ జనాభాకు వ్యాక్సిన్లు ఇవ్వగలమని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. నష్టపరిహారాల నుంచి చట్టపరమైన రక్షణకు సంబంధించి ఇంకా ఫైజర్, మోడెర్నాలతో చర్చలు జరుగుతున్నాయి.అయినా వచ్చే ఏడాది జనవరి వరకూ మోడెర్నా ఇండియాకు వచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల సేకరణ ఇంకా ప్రారంభించలేదని చెప్పాయి. గత వారమే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ తయారుచేయబోయే 30 కోట్ల వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తుందని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.