న్యూఢిల్లీ జూన్ 8
ఆగ్రాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో 22 మంది రోగులు మరణించారనే వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆక్సిజన్ తో పాటు మానవత్వం కొరవడటంతోనే అనర్ధాలు జరుగుతున్నాయని కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. రోగుల మరణాలకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరిన రాహుల్ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాంపం తెలిపారు.మరోవైపు ఆగ్రాలోని పారస్ దవాఖానలో కొవిడ్-19 రోగుల మరణానికి ఆక్సిజన్ కొరతే కారణమని తెలుస్తోందని, ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణ చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం రోగుల మరణానికి కారణం ఏమిటనేది వెల్లడవుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 26 ఉదయం తమ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ జరిగిన సందర్భంలో 22 మంది కరోనా రోగులు మరణించి ఉండవచ్చని పారస్ హాస్పిటల్ యజమాని అంగీకరించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగుచూసింది.