YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా

ముంబై జూన్ 8
ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఆమె పదవి గురించి హైకోర్టు మౌనంగా ఉంది. నవనీత్ కౌర్ (35) ఏడు భాషలు మాట్లాడగలరు. ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అడ్సల్ సవాల్ చేశారు. మార్చిలో ఆమె మాట్లాడుతూ, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్‌సభ లాబీలో బెదిరించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తాను జైలుపాలవుతానని ఆయన అన్నారని చెప్పారు. మరోవైపు ఆమె లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్ కాల్స్, శివసేన లెటర్ హెడ్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అమరావతి లోక్‌సభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, ఈ స్థానం నుంచి పోటీ చేశారని ఆరోపిస్తూ శివసేన నేత, మాజీ ఎంపీ ఆనంద్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు కోర్టు నిర్థరించింది. దీనిని రద్దు చేస్తూ, రూ.2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఇదిలావుండగా 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా గతంలో హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. నవనీత్ కౌర్ 1986 జనవరి 3న ముంబైలో జన్మించారు. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు.

Related Posts