YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నన్ను ఆశీర్వదించండి : ఈటల... ఈటల రోడ్ షోకు భారీ స్పందన

నన్ను ఆశీర్వదించండి : ఈటల...  ఈటల రోడ్ షోకు భారీ స్పందన

కరీంనగర్, జూన్ 8, 
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రోడ్ షో నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయ‌న తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపూర్‌ మండలంలో ద్విచక్రవాహనాలతో ఆయన అభిమానులు రోడ్‌షో చేపట్టారు. కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ తీసి ఆయన వెంట వెళ్లారు.శంభునిపల్లి, కానెపర్తి గ్రామాల మీదుగా ఈటల రోడ్‌షో కొనసాగింది. ఈటల మద్దతుదారులు, అభిమానులు, యువకులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈట‌ల ప‌ర్య‌ట‌న దృష్ట్యా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహ‌రించారు. హుజూరాబాద్ నుంచే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తానని ఆయన వెల్లడించారు. అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నేతల కుట్రలను ఇక్కడి ప్రజలు తిప్పికొడతారన్నారు. క్ర‌మంగా సంపాదించుకున్న వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వాడుకుంటూ కొంద‌రు నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గొర్ల మంద‌ల మీద తొడేళ్లు ప‌డ్డ‌ట్లుగా నా మ‌ద్ద‌తు దారుల‌పై దాడులు చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా వారిని కొన‌లేరు' అన్నారు ఈట‌ల.'తెలంగాణ ఉద్య‌మానికి క‌రీంన‌గ‌ర్ కేంద్ర బిందువైతే ఆ క‌రీంన‌గ‌ర్‌ను కాపాడుకున్న ప్రాంతం హుజురాబాద్‌. సంపూర్ణ మ‌ద్ద‌తు నాకే ఇస్తామ‌ని ప్ర‌జ‌లు చెప్పారు. కేసీఆర్ విజ‌యం సాధించే అవ‌కాశం లేద‌ని చెప్పారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగే సంగ్రామం కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు మ‌ధ్య జ‌రిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంది' అని ఈట‌ల పేర్కొన్నారు.'తెలంగాణ‌లో ఉద్య‌మంలో పాల్గొని ఈ రోజు భంగ‌ప‌డ్డ వారంతా రేపు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటికి తిరుగుతారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యువ‌త‌, నిరుద్యోగులు, ప్రైవేటు కార్మికులు, హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తోన్న వారు న‌న్ను ఆశీర్వ‌దించారు. నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని చెప్పారు' అని ఈట‌ల అన్నారు.'కొంద‌రు వ్య‌క్తులు ఈ రోజు టీఆర్ఎస్ తొత్తులుగా, బానిస‌లుగా మారిపోయి నా మ‌ద్ద‌తుదారులు, ప్ర‌జ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ అవ‌మానిస్తున్నారు. రాజ‌కీయంగా మిమ్మ‌ల్ని బొంద పెడ‌తాం. హుజురాబాద్ నుంచే మ‌ళ్లీ కొత్త శ‌కం ప్రారంభ‌మ‌వుతుంది.. మ‌రో ఉద్య‌మం ప్రారంభ‌మ‌వుతుంది' అని ఈటల హెచ్చరించారు.'ఈ హుజూరాబాద్ గెలుపే ఆత్మ‌గౌర‌వంపై పోరాడుతున్న వారి గెలుపు అవుతుంది. తెలంగాణ ఉద్య‌మకారులు, ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడుతున్న వారు రాష్ట్రంలో త‌మ ప్రాంతాల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌కి వ‌చ్చి మీ మ‌ద్ద‌తు తెల‌పాలి' అని ఈటల కోరారు.'అడుగ‌డుగునా న‌న్ను ఆశీర్వ‌దించిన మ‌హిళ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. వారి ఆత్మ‌గౌర‌వాన్ని నేను కాపాడతాన‌ని చెబుతున్నాను. తెలంగాణ‌లో నీతి, నిజాయ‌తితో పాల‌న కొన‌సాగ‌ట్లేదు. అవినీతి, మ‌భ్య‌పెట్టే తీరుతో పాల‌న కొన‌సాగుతోంది.ప్ర‌గ‌తి భ‌వ‌న్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొంద‌రు నాపై మీడియా ముందు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నేను అంటే ఏంటో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసు. నా గురించి తప్పుడు వ్యాఖ్య‌లు చేస్తే వారే న‌ష్ట‌పోతారు త‌ప్ప నాకేం జ‌ర‌గ‌దు' అని ఈట‌ల చెప్పారు. త‌న‌ రాజీనామా త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పి తీరుతార‌ని ఈట‌ల‌ అన్నారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో ఓట‌ర్ల కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.ప్రగతి భవన్ స్క్రిప్టు చదివే వారి గురించి మాట్లాడనని ఈటల స్పష్టం చేశారు.

Related Posts