నిర్మల్ జూన్ 9
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డయాగ్నస్టిక్ హబ్ సెంటర్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ. 10 వేల కోట్లను వైద్య సేవలకు సీఎం కేటాయించారని వెల్లడించారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ షుగర్ తదితర 57 పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలే కాకుండా ఖర్చుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తారన్నారు.